Telugu Global
Andhra Pradesh

టీడీపీ ఎమ్మెల్యేపై నెగెటివ్ వార్తలు.. ఈనాడు రిపోర్టర్ కి వార్నింగ్..!

వెంటనే విలేకరికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చినా తగ్గేది లేదంటూ ఈనాడులో ఆయన వార్నింగ్ ఉదంతాన్ని సైతం ఇచ్చారు.

టీడీపీ ఎమ్మెల్యేపై నెగెటివ్ వార్తలు.. ఈనాడు రిపోర్టర్ కి వార్నింగ్..!
X

కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడులో వార్తలు వస్తాయని మనం ఊహించలేం. పోనీ కూటమిలో కొందరు తప్పుచేస్తున్నారంటూ జనసేన, బీజేపీని టార్గెట్ చేయొచ్చేమో కానీ టీడీపీ ఎమ్మెల్యేలను విమర్శించేంత సాహసం ఈనాడు చేస్తుందని అనుకోలేం. కానీ ఎక్కడో లెక్క తేడా కొట్టినట్టుంది. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా ఈనాడు ప్రధానంగా ఓ కథనం ప్రచురించింది. తనపై వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తానంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, నేరుగా ఈనాడు విలేకరిపైనే తిట్లదండకం మొదలు పెట్టారు. తమ విలేకరిని తిట్టారంటూ మళ్లీ ఆయనకు వ్యతిరేకంగా వార్తలిచ్చారు. దీంతో ఈ వ్యవహారం మరింత రచ్చగా మారింది.

అసలేంటి కథ..?

తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం.. వికృతమాల, మునగలపాళెం ప్రాంతాల్లో ట్రాక్టర్‌ ఇసుకకు రూ. 500 చొప్పున కొంతమంది అక్రమంగా వసూళ్లు చేస్తున్నారనేది ఈనాడు కథనం. ఇందులో ఎక్కడా ఎమ్మెల్యే పేరు కానీ, వారి అనుచురల పేర్లు కానీ లేవు. కానీ అది శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో జరగడం, దానికి కారణం బొజ్జలేనంటూ ప్రతిపక్షం విమర్శలు మొదలు పెట్టడంతో ఆయన రెచ్చిపోయారు. ఈనాడు పత్రికలో టీడీపీ ఎమ్మెల్యేకి వ్యతిరేక వార్తలా అంటూ ఉడుక్కున్నారు. వెంటనే విలేకరికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చినా తగ్గేది లేదంటూ ఈనాడులో ఆయన వార్నింగ్ ఉదంతాన్ని సైతం ఇచ్చారు.

ఎందుకీ హడావిడి..?

వాస్తవానికి టీడీపీకి, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఈనాడు వ్యతిరేకంగా వార్తలు రాయడం అరుదు. కానీ ఉచిత ఇసుక పేరుతో చాలా చోట్ల అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈనాడు కూడా ఆ ఆరోపణల్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతోంది, పైకి అంతా బాగానే ఉందని అంటోంది. శ్రీకాళహస్తి వంటి ప్రాంతాల్లో ఈ దందా మరింత ఎక్కువగా మారడంతో ఈనాడుకి అది తప్పనిసరి అయింది. అయితే ఎమ్మెల్యే విలేకరిని ఇంటికి పిలిపించి మరీ వార్నింగ్ ఇవ్వడంతో ఈ వ్యవహారం మరింత రచ్చగా మారింది.

First Published:  24 Aug 2024 7:22 AM IST
Next Story