Telugu Global
Andhra Pradesh

ఇండియా కూటమిలోకి జగన్‌.. యనమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ కార్యకర్తలు, నేతలపై దాడులను నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వ‌ద్ద‌ ఇటీవల జగన్‌ ధర్నా చేసిన విషయం తెలిసిందే.

ఇండియా కూటమిలోకి జగన్‌.. యనమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌
X

ఢిల్లీలో జగన్ ధర్నాకు ఇండియా కూటమి పార్టీల మద్దతుపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ప్రాంగ‌ణంలో మాట్లాడిన యనమల.. ఇండియా కూటమికి జగన్‌ దగ్గరయ్యే అవకాశాలు పుష్కలంగా క‌నిపిస్తున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌కు ఢిల్లీ స్థాయిలో ఓ షెల్టర్ కావాలన్నారు యనమల. ఇదే సమయంలో ఇండియా కూటమికి కూడా పార్టీలు కావాలని కామెంట్ చేశారాయన. ధర్నాకు ఇండియా కూటమి పార్టీలు రావడమే దీనికి సంకేతమన్నారు.

ఇండియా కూటమిలో జగన్‌ చేరడం అనివార్యమన్నారు యనమల. ఇన్నాళ్లూ బీజేపీని అడ్డుపెట్టుకుని జగన్ పబ్బం గడుపుకున్నారని, కానీ టీడీపీ, జనసేన NDAలో చేరడంతో బీజేపీ కూటమిలోకి జగన్‌ రాలేని పరిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. ఇక షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ.. కూటమి పార్టీగా జగన్‌ ఇండియాలో భాగస్వామి కాబోతున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యనమల. కాగా, అక్కడే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు జగన్‌కు ఇండియా కూటమిలో చేరేంత ధైర్యం ఉందా అంటూ యనమలను ప్రశ్నించారు. జగన్ అంత సాహసం చేస్తార‌ని తాను అనుకోవడంలేదంటూ కామెంట్ చేశారు విష్ణు కుమార్ రాజు.

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ కార్యకర్తలు, నేతలపై దాడులను నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వ‌ద్ద‌ ఇటీవల జగన్‌ ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు విపక్ష పార్టీల నుంచి విశేష మద్దతు లభించింది. ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న సమాజ్‌వాదీ, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం, టీఎంసీతో పాటు AIDMK లాంటి పార్టీలు మద్దతు తెలిపాయి. జాతీయ మీడియాలోనూ ఏపీలో దాడుల అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది.

First Published:  26 July 2024 12:54 PM IST
Next Story