గ్రూప్-2 వాయిదాపై కొనసాగుతున్న ఉత్కంఠ
పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ గ్రూప్-2 అభ్యర్థులు ఇసుకతోట కూడలి వద్ద నేషనల్ హైవేపై బైఠాయించి ధర్నా

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతున్నది. పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ గ్రూప్-2 అభ్యర్థులు విశాఖలో ఆందోళనకు దిగారు. సుమారు రెండు గంటలుగా ఇసుకతోట కూడలి వద్ద నేషనల్ హైవేపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విశాఖ వ్యాలీ జంక్షన్ వరకు వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ట్రాఫిక్ మళ్లింపునకు పోలీసులు చర్యలు చేపట్టారు.
మరోవైపు పరీక్ష నిర్వహించాలని సర్వీస్ కమిషన్ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. డ్యూటీ టైమింగ్స్ అయిపోవడంతో ఏపీపీఎస్సీ కార్యాలయ సిబ్బంది వెళ్లారు. ఆఫీసుకు తాళం వేసి ఉన్నదని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నది. అక్కడి వచ్చిన అభ్యర్థులు వెనుదిరుగుతున్నారు.