Telugu Global
Andhra Pradesh

స్వతంత్ర సిట్‌ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం

శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటుకు సూచిస్తున్నామన్న జస్టిస్‌ బీఆర్‌ గవాయి

స్వతంత్ర సిట్‌ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం
X

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాదనల సందర్భంగా ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సిట్‌లో సీబీఐ నుంచి ఇద్దరు అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీస్‌ అధికారులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒక సీనియర్‌ అధికారి ఉండాలని పేర్కొన్నది. ఈ అంశం పొలిటికల్‌ డ్రామాగా మారొద్దని కోరుకుంటున్నట్లు చెప్పింది. సిట్‌ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షిస్తారని పేర్కొన్నది.

అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపారు. మొత్తం అంశాన్ని పరిశీలించాను. సిట్‌ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవు. వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులున్నారు. సీనియర్‌ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుంది అన్నారు. అనంతరం స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ.. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, విక్రమ్‌ సంపత్‌ అనే భక్తుడు, సుదర్శన్‌ టీవీ ఎడిటర్‌ సురేష్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై సుప్రీం ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన సిట్‌నే కొనసాగించాలా? లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలన్నా అన్న అంశంపై కేంద్రం తరఫున అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు సూచిస్తూ ..గురువారానికి వాయిదా వేసింది. అయితే నిన్న తాను మరో కేసు విచారణలో ఉన్నందున ఈ కేసు విచారణను శుక్రవారం ఉదయానికి వాయిదా వేయాలన్న సొలిసిటర్‌ జనరల్‌ విజ్ఞప్తిని జస్టిస్‌ బీఆర్‌ గవాయి పరిగణనలోకి తీసుకున్నారు. శుక్రవారం మొదటి నంబర్‌ కింద విచారించడానికి అంగీకరిస్తూ వాయిదా వేశారు.

First Published:  4 Oct 2024 11:49 AM IST
Next Story