Telugu Global
Andhra Pradesh

జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణ బెంచ్‌ను మార్చిన సుప్రీం

విచారణకు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం పంపాలని రిజిస్ట్రీకి ఆదేశం

జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణ బెంచ్‌ను మార్చిన సుప్రీం
X

వైసీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై సీజేఐ ధర్మాసనం మరో బెంచ్‌కు మార్చింది. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని, విచారణను హైదరాబాద్‌ నుంచి మార్చాలని టీడీపీ ఎమ్మెల్యే గతంలో వేర్వేర్వుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం విచారణ చేపట్టి పిటిషన్లపై విచారణ బెంచ్‌ను మార్చింది.

సీజేఐ ధర్మాసనంలో జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ సభ్యుడిగా ఉన్నారు. విచారణ ప్రారంభం కాగానే.. ఈ పిటిషన్లు ఏపీకి చెందినవని జగన్‌ తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్‌ తెలిపారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో కౌంటర్‌ దాఖలు చేసేందుకు తమకు కూడా కొంత సమయం కావాలని సీబీఐ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరారు. ఈ క్రమంలో జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ 'నాట్‌ బిఫోర్‌ మీ' అనడంతో రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను మరో ధర్మాసనానికి సీజేఐ బదిలీ చేశారు. జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు డిసెంబర్‌ 2న విచారణకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

First Published:  12 Nov 2024 6:14 AM GMT
Next Story