Telugu Global
Andhra Pradesh

తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి

వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో చోటు చేసుకున్న అపశృతి

తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి
X

వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో తిరుపతిలో అపశ్రుతి చోటుచేసుకున్నది. టోకెన్ల కోసం ఊహించని రీతిలో భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లు గుర్తించారు. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌ల్లో తిరుపతిలోని ఆస్పత్రులకు తరలించారు. రుయా ఆస్పత్రిలో 20 మంది, స్విమ్స్‌లో 9 మంది చికిత్స పొందుతున్నారు. రుయా ఆస్పత్రికి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, టీటీడీ ఈవో శ్యామలరావు చేరుకొని వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు.

తిరుపతిలోని శ్రీనివాసం, సత్యనారాయణపురం బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్‌ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో భక్తుల మధ్య తోపులాట జరిగింది. గురువారం ఉదయం 5 గంటల నుంచి తిరుపతిలోని తొమ్మిది కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అయితే, టోకెన్ల కోసం ఇవాళ సాయంత్రమే భక్తులు భారీగా తరలివచ్చారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. తోపులాట జరిగిన ప్రాంతాలకు విజిలెన్స్‌, అదనపు పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. మరోవైపు, ఘటనా స్థలం వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు నగర పాలక కమిషనర్‌ తెలిపారు.

అసలేం జరిగింది?

టోకెన్ల కోసం వచ్చిన భక్తులు రోడ్లపై గుమిగూడకుండా బైరాగిపట్టెడ వద్ద ఉన్న పద్మావతి పార్కులో ఉంచారు. అయితే టోకెన్ల జారీ కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థతకు గురికావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించడానికి క్యూలైన్‌ తెరిచారు. టోకెన్లు జారీ చేయడానికి క్యూలైన్‌ ఓపెన్‌ చేశారని భావించి భక్తులు ఒక్కసారిగా దూసుకువచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్యూలైన్ల వద్ద సరైన భద్రత ఏర్పాట్లు చేయలేదని మరికొందరు ఆరోపిస్తున్నారు. టోకెన్ల కోసం ఎంతమంది భక్తులు వచ్చారు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్థానిక సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించలేదని సమాచారం.

ఈ నెల 10, 11,12 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులకు 1.20 లక్షల టోకెన్లను గురువారం ఉదయం జారీ చేయాల్సి ఉన్నది. మిగిలిన రోజులకు సంబంధఙంచి ఆయా తేదీల్లో తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో ఇవ్వనున్నట్లు టీటీడీ తెలిపింది. అయితే, భక్తుల రద్దీ కారణంగా ఇవాళ రాత్రి నుంచే టోకెన్లు జారీ చేస్తున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు.

First Published:  8 Jan 2025 11:05 PM IST
Next Story