ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికోసం టాస్క్ ఫోర్స్
అమరావతిలో 'స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్‌షిప్' సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది.
ప్రతిపక్ష వైసీపీ సూపర్ సిక్స్ ఎక్కడ అంటోంది.. ఏపీ ప్రభుత్వం మాత్రం అది మినహా అన్నీ అనేట్టుగా ఉంది. తాజాగా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, సూచనలు, సలహాలు, ప్రణాళికలకోసం ఓ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలతోపాటు, వివిధ రంగాల్లో నిపుణులుగా ఉన్న వారిని ఈ టాస్క్ ఫోర్స్ లో భాగస్వాముల్ని చేస్తూ దీనికి చైర్మన్ గా సీఎం చంద్రబాబు వ్యవహరించబోతున్నారు. కో-చైర్మన్ గా టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఉంటారు. తాజాగా దీనికి సంబంధించిన కీలక మీటింగ్ జరిగింది. సీఎం చంద్రబాబు, టాటా చైర్మన్ చంద్రశేఖరన్, ఇతర పారిశ్రామిక వేత్తలు.. ఏపీలో పారిశ్రామికాభివృద్ధిపై చర్చించారు.
2047 నాటికి పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానానికి తీసుకెళ్లడం లక్ష్యంగా పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు. దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై టాస్క్‌ఫోర్స్ సూచనలు ఇస్తుంది. రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. క్లస్టర్ విధానాన్ని అభివృద్ధి చేయాలని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వానికి చెప్పారు. ఇక రాష్ట్రంలో 13 స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు బజాజ్ గ్రూప్ ఆసక్తి కనబరిచినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ తరహాలో ఏపీలో కూడా ఫార్మా కారిడార్ ఏర్పాటుకి ప్రయత్నాలు చేపట్టాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై దృష్టి సారించాలని, రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచాలని, టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి.
అమరావతిలో ‘స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్‌షిప్’ సంస్థ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ముందుకొచ్చింది. ఈ మేరకు బీసీఐ చైర్మన్ తో కూడిన ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబుని కలసి తమ ప్రతిపాదనలను ఇచ్చింది. సీఆర్‌డీఏ పరిధిలో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేద్దామని వారితో చెప్పారు ఏపీ ముఖ్యమంత్రి.