Telugu Global
Andhra Pradesh

కారుతో ఢీకొట్టి తండ్రిని చంపిన కొడుకు.. - ఆస్తిలో వాటా ఇవ్వలేదని దారుణం

తాను ఎంత చెప్పినా తండ్రి మొండిగా వ్యవహరిస్తున్నాడనే కోపంతో రఘునాథరెడ్డి ఆయన్ని తన కారుతో ఢీకొట్టి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బెంగళూరులో ఉన్న తమ్ముడు శంకర్‌రెడ్డికి ఫోన్‌ చేసి చెప్పాడు.

కారుతో ఢీకొట్టి తండ్రిని చంపిన కొడుకు.. - ఆస్తిలో వాటా ఇవ్వలేదని దారుణం
X

కన్న తండ్రిని కొడుకు కారుతో ఢీకొట్టి హతమార్చిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని పుల్లారెడ్డి వీధికి చెందిన మీరుగట్టు చిన్న రెడ్డప్ప రెడ్డి (65)కి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రఘునాథరెడ్డి ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. చిన్న కుమారుడు శంకర్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అతను బెంగళూరులో ఉంటున్నాడు.

రఘునాథరెడ్డి ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేస్తూ రూ.16 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. అప్పులిచ్చిన వారి వేధింపులు ఎక్కువవ్వడంతో తన తండ్రిని ఆస్తిలో వాటా ఇవ్వాలని కోరాడు. ఈ విషయమై తండ్రీకొడుకుల మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి భోజనం అనంతరం సమీపంలోని వాకింగ్‌ ట్రాక్‌పై నడుస్తున్న తండ్రిని రఘునాథరెడ్డి నిలదీశాడు. ఈ సందర్భంగా వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

తాను ఎంత చెప్పినా తండ్రి మొండిగా వ్యవహరిస్తున్నాడనే కోపంతో రఘునాథరెడ్డి ఆయన్ని తన కారుతో ఢీకొట్టి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బెంగళూరులో ఉన్న తమ్ముడు శంకర్‌రెడ్డికి ఫోన్‌ చేసి చెప్పాడు. అతను వెంటనే స్థానికంగా ఉన్న బంధువులకు, పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పాడు. బంధువులు, పోలీసులు రాత్రంతా చిన్న రెడ్డప్ప కోసం గాలింపు చేపట్టారు. గురువారం తెల్లవారుజామున పట్టణంలోని వీవర్స్‌ కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిన్నరెడ్డప్ప మృతదేహాన్ని గుర్తించారు. మదనపల్లె డీఎస్పీ ప్రసాదరెడ్డి, సీఐ యువరాజు ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. పోలీసులు రఘునాథరెడ్డిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకొని అతడి నుంచి కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.

First Published:  19 July 2024 4:18 AM GMT
Next Story