అధికార పార్టీ వేధింపులపై తిరగబడ్డ చిరుద్యోగులు.. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు
లేనిపోని కారణాలు చూపుతూ చిరుద్యోగులను బలవంతంగా తొలగించడం, స్థానిక నాయకులు జోక్యం చేసుకుని వేధింపులకు గురిచేయడం ఆపకపోతే నిరవధిక ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
అధికార పార్టీ వేధింపులు తాళలేక చిరుద్యోగులు నిరసన గళమెత్తారు. ఉద్యోగాల తొలగింపు, వారిపై రాజకీయ వేధింపులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ధర్నాలు నిర్వహించారు. అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్‌ల వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఐకేపీ, వీఓఏలు, మధ్యాహ్న భోజన పథకం, పారిశుధ్య కార్మికులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లతో పాటు వివిధ రంగాలకు చెందిన చిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యోగులపై అధికార పార్టీ నాయకుల వేధింపులను తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు.
మాకు రాజకీయ మరకలు పూయొద్దు...
మాకు రాజకీయ మరకలు పూయొద్దు.. మా ఉద్యోగం మమ్మల్ని చేసుకోనివ్వండి.. అంటూ చిరుద్యోగులు ధర్నాల్లో నినదించారు. తమ పొట్టగొడితే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. పలుచోట్ల ఖాళీ కంచాలతో నిరసన తెలిపారు. లేనిపోని కారణాలు చూపుతూ చిరుద్యోగులను బలవంతంగా తొలగించడం, స్థానిక నాయకులు జోక్యం చేసుకుని వేధింపులకు గురిచేయడం ఆపకపోతే నిరవధిక ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
విజయవాడలో జరిగిన ధర్నాకు ప్రభుత్వ శాఖలకు చెందిన చిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని చిరుద్యోగులు పుట్టపర్తిలో ధర్నా చేపట్టారు. ఓడీ చెరువు మండలం వీరప్పగారిపల్లి అంగన్‌వాడీ కార్యకర్త నాగమణి ఆత్మహత్యాయత్నం, మరో కార్యకర్త సుహాసినిపై దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్త కుటుంబంపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై మండిపడ్డారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం వద్ద ఖాళీ ప్లేట్లతో ధర్నా చేపట్టారు. రాజమహేంద్రవరం, కాకినాడ, పార్వతీపురంలలో ర్యాలీలు నిర్వహించారు. అక్రమ తొలగింపులను తక్షణం నిలుపుదల చేయాలని, ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడానికి వీల్లేదని చిరుద్యోగులు ఆందోళనల్లో భాగంగా డిమాండ్ చేశారు.