Telugu Global
Andhra Pradesh

ముంబై హీరోయిన్ వార్తలు.. సజ్జల వార్నింగ్

ఈనాడు, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు, మరికొన్ని ఛానెళ్లలో ప్రసారమైన కథనం పూర్తిగా అవాస్తవం అంటూ సజ్జల ఓ ప్రకటన విడుదల చేశారు.

ముంబై హీరోయిన్ వార్తలు.. సజ్జల వార్నింగ్
X

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఓ ముంబై హీరోయిన్ ని వైసీపీ నేత కుమారుడు మోసం చేశారని, ఆమెని వదిలించుకునే క్రమంలో ఆ యువనేతకు సజ్జల రామకృష్ణారెడ్డి సహాయం చేశారని, ఆ కేసు కోసం పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేశారంటూ టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు ప్రసారమైన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా ఉంది. ఈ ఆరోపణలను వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. ముంబై నటి కేసులో కొన్ని మీడియా సంస్థలు తన పేరు ప్రస్తావించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.

ఈనాడు, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు, మరికొన్ని ఛానెళ్లలో ప్రసారమైన కథనం పూర్తిగా అవాస్తవం అంటూ సజ్జల ఓ ప్రకటన విడుదల చేశారు. అన్యాయంగా, అడ్డగోలుగా ఆ రాతలు ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారాయన. తన ప్రతిష్టను దెబ్బ తీసేలా అలాంటి కథనాలు రాసినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

ఎన్నికల హామీల అమలు నుంచి తెలివిగా తప్పించుకోడానికి టీడీపీ చేస్తున్న కుటిల యత్నాల్లో భాగంగానే ముంబై హీరోయిన్ వార్తలు ప్రచారంలోకి వచ్చాయని అన్నారు సజ్జల. వైసీపీ ప్రతిష్టను దెబ్బ తీయడం, ఆ పార్టీ నాయకుల వ్యక్తిత్వ హననం లక్ష్యంగా అవాస్తవ కథనాలు రాస్తున్నారని చెప్పారు. ఆ కథనాలను పట్టుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఇదంతా ఓ పద్ధతి ప్రకారం పక్కా ప్లాన్ తో జరుగుతోందని ఆరోపించారు సజ్జల. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న హత్యలు, దౌర్జన్యాలు, దాడులు, ఆస్తుల విధ్వంసం, అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం కూటమి ప్రభుత్వం, దానికి సంబంధించిన మీడియా కొత్త పన్నాగం మొదలు పెట్టిందిని అన్నారు. తమపై బురదజల్లాలని చూసినా, తాము ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామని చెప్పారు. హామీలు అమలు చేసే వరకు కూటమి ప్రభుత్వాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సజ్జల.

First Published:  27 Aug 2024 3:39 PM IST
Next Story