Telugu Global
Andhra Pradesh

కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు..? రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీలో బాబు, జగన్, పవన్ తో కూడిన బీజేపీ అధికారంలో ఉందని, ప్రధాన ప్రతిపక్షం లేదని.. షర్మిల మాత్రమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. 2029లో ఏపీకి షర్మిల ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.

కడప ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు..? రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

కడప జిల్లా రాజకీయాలపై ఇటీవల సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారని, ఆ స్థానంలో విజయమ్మ పోటీ చేస్తారని.. అదే సమయంలో అవినాష్ రెడ్డి కడప ఎంపీగా రాజీనామా చేస్తారని, ఆ స్థానానికి జగన్ పోటీ చేసి పార్లమెంట్ కి వెళ్లాలనుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. ఈ సోషల్ మీడియా పుకార్లను ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు కానీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నిండు సభలో స్పందించారు. కడప పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల గెలుపుకోసం తాను ప్రచారం చేస్తానన్నారు. ఆమె గెలుపు కోసం ఊరూరూ తిరిగే బాధ్యత తాను తీసుకుంటానన్నారు రేవంత్ రెడ్డి.


వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి వైసీపీ సందడి కొనసాగితే, సాయంత్రం ఏపీ కాంగ్రెస్.. మంగళగిరిలో సంస్మరణ సభ నిర్వహించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైఎస్ఆర్ పాలనపై రేవంత్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. కాలక్రమంలో ఎంత గొప్ప నాయకుడినైనా ప్రజలు మరచిపోతారని, కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మాత్రం ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరన్నారు రేవంత్ రెడ్డి. వైఎస్ఆర్ తో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారాయన. శాసనమండలిలో తాను మాట్లాడినప్పుడు వైఎస్‌ఆర్‌ ప్రోత్సహించారన్నారు. ప్రతిపక్ష సభ్యుల విషయంలోనూ ఆయన ఎంతో ఉదారంగా ఉండేవారని చెప్పారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ప్రధాన ప్రతిపక్షం తరపున 40నిమిషాల పాటు ఏకధాటిగా మాట్లాడానని, అప్పుడు కూడా తనను ఆయన ప్రోత్సహించారన్నారు. తాను ముఖ్యమంత్రిగా తెలంగాణ అసెంబ్లీలో ప్రసంగించేటప్పుడు కూడా వైఎస్ఆర్ ని గుర్తు చేసుకున్నానని చెప్పారు రేవంత్ రెడ్డి.

గతంలో వైఎస్‌ఆర్‌ పోషించిన ప్రతిపక్ష పాత్రను ఇప్పుడు ఆయన కుమార్తె షర్మిల పోషిస్తున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. ప్రజల పక్షాన ఆమె అలుపెరుగని పోరాటం చేస్తున్నారని, ఆ పోరాటం వృథాగా పోదన్నారు. ప్రతి పోరాటానికి కచ్చితంగా ఫలితం ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి.

బీజేపీ అంటే..

ఏపీలో బాబు, జగన్, పవన్ తో కూడిన బీజేపీ అధికారంలో ఉందని, ప్రధాన ప్రతిపక్షం లేదని.. షర్మిల మాత్రమే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. 2029లో ఏపీకి షర్మిల ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. 2029లో దేశానికి రాహుల్ ప్రధాని అవుతారని, ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, వైఎస్ఆర్ చివరి కోరిక కూడా అదేనన్నారు రేవంత్ రెడ్డి.

First Published:  8 July 2024 3:47 PM GMT
Next Story