Telugu Global
Andhra Pradesh

జగన్‌ తిరుమల పర్యటనపై ఆంక్షలా? ఎందుకంత భయం బాబూ?

దేవుడిపై భక్తి లేనివారు జగన్‌ను కట్టడి చేయాలని చూస్తున్నారని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం

జగన్‌ తిరుమల పర్యటనపై ఆంక్షలా? ఎందుకంత భయం బాబూ?
X

హిందూ ధర్మం ఆలయాలకు ఎవరు వచ్చినా సాదరస్వాగతం పలుకుతుంది. అలాంటి ఐదేళ్లు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నేతను అడ్డుకోవాలని చూస్తారా? జగన్‌ తిరుమల పర్యటనను రాజకీయం చేస్తున్నారని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ నేతలను హౌస్‌ అరెస్టులు చేయడం దారుణమని మండిపడ్డారు. జగన్‌ను చూసి చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబు పాశవిక విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. చంద్రబాబు మీరు చాలా పాపం చేశారు. చంద్రబాబూ మీరొక మాట.. వపన్‌ మరో మాట మాట్లాడుతారు. బాబు శిష్యులు జగన్‌ను రానివ్వమంటూ భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. బీజేపీ నేతలు డిక్లరేషన్‌ కోసం భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నారంటూ కరుణాకర్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

చంద్రబాబు డిఫెన్స్‌లో పడ్డారు. దేవుడిపై భక్తి లేనివారు జగన్‌ను కట్టడి చేయాలని చూస్తున్నారని భూమన ధ్వజమెత్తారు. ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని సనాతన ధర్మం చెబుతున్నది. ఓనమాలు తెలియని వారు కూడా సనాతన ధర్మంపై మాట్లాడుతున్నారు.వ్యక్తిగత రాజకీయాల్లోకి శక్తిమూర్తిని తీసుకురావొద్దని ఇకనైనా మీ రాజకీయాలు ఆపండని భూమన సీఎం చంద్రబాబుకు సూచించారు. వేదమూర్తి ప్రసాదం మీద వెయ్యి నాలుకలతో మాట్లాడకండి. నెయ్యిని పరీక్షించేందుకు తిరుమలలో ల్యాబ్స్‌ లేవని టీటీడీ ఈవో చెప్పారు. మరి ఇన్నిరోజులు టెస్టులు చేయకుండానే ట్యాంకర్లను లోపలకు పంపారా? అని ప్రశ్నించారు. మేము అడిగే ప్రశ్నలకు టీటీడీ ఈవో శ్యామలరావు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ రెండు నెలల పాటు అసలు నెయ్యి సరఫరా జరగలేదా? నిలదీశారు రాజకీయ కల్మషంతోనే ఆరోపణలు చేస్తున్నారు. మా నాయకుడు కచ్చితంగా దైవదర్శనం చేసుకొనే వెళ్తారని స్పష్టం చేశారు.

డైవర్షన్‌ కోసమే డిక్లరేషన్‌ పేరుతో డ్రామాలు

మరోవైపు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో చంద్రబాబు సర్కార్‌ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతికి ఎవరూ రావొద్దంటూ మా పార్టీ నేతలకు పోలీసులు నోటీసులు జారీచేయడంపై మండిపడుతున్నారు. తిరుపతి లడ్డూపై చంద్రబాబు దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంద రోజుల పాలనలో హామీలు అమలు కాలేదని డైవర్షన్‌ కోసమే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ పర్యటనకు అడ్డుకోవడానికే డిక్లరేషన్‌ పేరుతో డ్రామాకు తెరలేపారు. మా నాయకుడు మొదటిసారి తిరుమలకు వెళ్లడం లేదు. పాదయాత్రకు ముందు కూడా తిరుమల వెళ్లారు. సీఎం హోదాలో శ్రీవారికి జగన్‌ పట్టు వస్త్రాలు సమర్పించిన విషయాన్ని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేశారు. తిరునామాలాతో స్వామి వారి సేవలో పాల్గొన్న వారికి ఇప్పుడు డిక్లరేషన్‌ ఇవ్వాలని రాజకీయాలు చేస్తారా? అని ప్రశ్నించారు.

First Published:  27 Sept 2024 11:56 AM IST
Next Story