Telugu Global
Andhra Pradesh

రెడ్ బుక్ పాలనలో వ్యవస్థలు సర్వ నాశనం -జగన్

హత్య చేసిన వారినే కాదు, చేయించిన వారిని కూడా జైలులో పెట్టాలన్నారు జగన్. ఏపీలో జరుగుతున్న రాజకీయ హత్యలకు సంబంధించిన కేసుల్లో చంద్రబాబు, లోకేష్‌ను కూడా ముద్దాయిలుగా చేర్చాలని డిమాండ్ చేశారు.

రెడ్ బుక్ పాలనలో వ్యవస్థలు సర్వ నాశనం -జగన్
X

ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన స్థానంలో రెడ్ బుక్ పాలన జరుగుతోందని మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి జగన్. నంద్యాలలో ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జగన్ నంద్యాల పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఆయన్ను కలిసేందుకు, ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు.


తండ్రీకొడుకులు ముద్దాయిలు..

ఏపీలో జరుగుతున్న రాజకీయ హత్యలకు సంబంధించిన కేసుల్లో చంద్రబాబు, లోకేష్‌ను కూడా ముద్దాయిలుగా చేర్చాలని డిమాండ్ చేశారు జగన్. కేవలం రాజకీయ ఆధిపత్యం కోసమే ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే ఏపీలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని చెప్పారు. గ్రామాల్లో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు జగన్. వైసీపీ తరపున పోలింగ్‌ బూత్‌లో ఏజెంట్‌గా కూర్చున్నాడనే కారణంతో సుబ్బారాయుడిని చంపేయడం దారుణం అని అన్నారు. అదే సమయంలో ఆయన భార్యపై కూడా దాడి చేశారని, ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందని చెప్పారు. నిందితులు పారిపోవడానికి పోలీసులు సహకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్.

నిందితుల కాల్ డేటా చూస్తే అసలీ హత్యలు ఎవరు చేయించారో తెలుస్తుంది కదా అన్నారు జగన్. ఆ దిశగా పోలీసులు ఎందుకు ఎంక్వయిరీ చేయడం లేదని ప్రశ్నించారు. హత్య చేసిన వారినే కాదు, చేయించిన వారిని కూడా జైల్లో పెట్టాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు మీటింగ్ లు పెట్టి దాడులు చేయండి, హత్యలు చేయండి అని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా అరాచకం సృష్టిస్తున్నారని, రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకి ఏమాత్రం లేదన్నారు జగన్.

First Published:  9 Aug 2024 11:02 AM GMT
Next Story