డొక్కా సీతమ్మ సరే.. బుడ్డా వెంగళరెడ్డికి గుర్తింపేది..?
సాక్షి కథనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరువు సమయంలో రాయలసీమ ప్రాంత వాసుల ఆకలి తీర్చిన బుడ్డా వెంగళరెడ్డికి గుర్తింపునివ్వాలని స్థానిక నేతలు తమ వాదన వినిపిస్తున్నారు.

ఏపీలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గతంలో జగనన్న గోరుముద్దగా ఉన్న పథకానికి పేరు మార్చడంపై సాక్షిలో ఓ ఆసక్తికర కథనం వచ్చింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారడం సహజం అని, అయితే రాయలసీమను ఎవరూ పట్టించుకోకపోవడం విచిత్రం అని విమర్శిస్తూ ఆ కథనం సాగింది. రాయలసీమలో కరువు వచ్చినప్పుడు ఆస్తుల్ని తెగనమ్మి ప్రజలకు ఆహారం పెట్టిన కడప జిల్లా ఉయ్యాలవాడ గ్రామ వాసి బుడ్డా వెంగళరెడ్డి పేరు ప్రభుత్వానికి ఎందుకు గుర్తురాలేదని ఈ కథనంలో సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్ర విభజన తర్వాత 2014నుంచి 2019 వరకు ప్రభుత్వ పథకాలకు ఎన్టీఆర్, చంద్రన్న పేర్లు ఉండేవి. ఆ తర్వాత వైసీపీ హయాంలో తిరిగి వైఎస్ఆర్, జగనన్న పేర్లు పెట్టుకున్నారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి పేర్ల మార్పు మొదలైంది. అయితే ఈసారి మిత్రపక్షం జనసేన కోరిక మేరకు డొక్కా సీతమ్మకు ఇతర ప్రముఖుల పేర్లకు ప్రాధాన్యమిచ్చారు. దీంతో అసలు గొడవ మొదలైంది. డొక్కా సీతమ్మకు గుర్తింపు ఇవ్వడం వల్ల ఎవరికీ ఇబ్బంది లేదని, కానీ రాయలసీమ ప్రాంత వాసులకు కూడా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అంటూ సాక్షి నిలదీస్తూ కథనాలిచ్చింది.
సాక్షి కథనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరువు సమయంలో రాయలసీమ ప్రాంత వాసుల ఆకలి తీర్చిన బుడ్డా వెంగళరెడ్డికి కచ్చితంగా గుర్తింపునివ్వాలంటూ కొందరు స్థానిక నేతలు తమ వాదన వినిపిస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా మాత్రం సాక్షిని రివర్స్ లో టార్గెట్ చేసింది. అసలు ఐదేళ్లు జగన్ అధికారంలో ఉన్నప్పుడు బుడ్డా వెంగళరెడ్డి పేరు సాక్షికి ఎందుకు గుర్తు రాలేదని నిలదీస్తున్నారు నెటిజన్లు. జగనన్న గోరు ముద్ద బదులు బుడ్డా వెంగళరెడ్డి పేరు ఆ పథకానికి పెట్టి ఉండొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ లాజిక్ కి వైసీపీ నుంచి, లేదా సాక్షి నుంచి బదులు వస్తుందా..? వచ్చేసారి అధికారంలోకి వస్తే బుడ్డా వెంగళరెడ్డికి గౌరవం ఇస్తామని ఆ పార్టీ నేతలు చెప్పగలరా..? వేచి చూడాలి.