Telugu Global
Andhra Pradesh

రేషన్ బండ్లకు బ్రేక్.. హింటిచ్చిన సీఎం చంద్రబాబు

గతంలో ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు, తమకు ఖాళీ ఉన్న సమయాల్లో రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తీసుకునేవారని, కానీ జగన్ నిర్ణయం వల్ల వీధుల్లో బండ్ల ముందు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం వచ్చిందన్నారు చంద్రబాబు.

రేషన్ బండ్లకు బ్రేక్.. హింటిచ్చిన సీఎం చంద్రబాబు
X

వైసీపీ హయాంలో జగన్ తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటి రేషన్ బండి. ఇంటి వద్దకే వచ్చి రేషన్ సరకులు పంపిణీ చేసేందుకు రేషన్ బండ్లను అందుబాటులోకి తెచ్చారు అప్పటి సీఎం జగన్. అయితే అది తెలివి తక్కువ నిర్ణయం అంటూ అప్పట్లోనే ప్రతిపక్షం విమర్శలు చేసింది. ఇప్పుడు ఆ ప్రతిపక్షమే అధికారంలోకి వచ్చింది. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించేలా లేదు. ప్రస్తుతానికి రేషన్ బండ్లు తిరుగుతున్నా త్వరలో వాటికి బ్రేక్ లు వేయబోతున్నారు. ఈరోజు కలెక్టర్ల మీటింగ్ లో ఈ విషయంపై హింటిచ్చేశారు సీఎం చంద్రబాబు.


గతంలో ప్రజలు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తీసుకునేవారని, కానీ జగన్ నిర్ణయం వల్ల రేషన్ సరకుల కోసం వీధుల్లో బండ్ల ముందు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం వచ్చిందన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వంలో మొత్తం రివర్స్ చేసేశారని ఎద్దేవా చేశారు. ఆ బండి వచ్చే దాకా ప్రజలు పనులు మానుకుని ఇంట్లో ఉండాలా అని ప్రశ్నించారు. అవే వాహనాలు వాడి, బియ్యం రీసైక్లింగ్ స్కామ్ చేశారన్నారు. వాటన్నిటినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు.

ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో రేషన్ బండ్లను ఆపేశారు, ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో కూడా వీటిని ఆపేసే యోచనలో ఉంది ప్రభుత్వం. అందుకే ముందుగా జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఈరోజు కలెక్టర్ల మీటింగ్ లో సెటైర్లు వేశారు సీఎం చంద్రబాబు. ఇంటివద్దకు రేషన్ ని ఆపేస్తే.. ఆ వాహనాలను ఏంచేయాలనేదే అసలు సమస్య. మరి ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచిస్తుందో లేదో చూడాలి.

First Published:  5 Aug 2024 2:54 PM GMT
Next Story