Telugu Global
Andhra Pradesh

ఆయనే బతికి ఉంటే..! రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

వైఎస్ఆర్ గురించి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నానని, వైఎస్ఆర్ ఆనాడు చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తితోనే తాను భారత్ జోడో యాత్ర పూర్తి చేశానన్నారు రాహుల్ గాంధీ.

ఆయనే బతికి ఉంటే..! రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
X

వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ ఆయన ఘనతను కీర్తిస్తూ చాలామంది నాయకులు సందేశాలిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా వైఎస్ఆర్ అసలు సిసలైన ప్రజా నాయకుడంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఎప్పుడూ ప్రజల కోసమే బతికిన నాయకుడు ఆయన అని గుర్తు చేసుకున్నారు. ఆయనే బతికి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మరోలా ఉండేదన్నారు. వైఎస్ఆర్ గురించి తాను వ్యక్తిగతంగా ఎంతో నేర్చుకున్నానని, వైఎస్ఆర్ ఆనాడు చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తితోనే తాను భారత్ జోడో యాత్ర పూర్తి చేశానన్నారు రాహుల్ గాంధీ.


వైఎస్ఆర్ వారసత్వాన్ని షర్మిల సమర్థంగా ముందుకు తీసుకెళ్తుందని రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం. ఆమె నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందన్నారాయన. వైఎస్ఆర్ మరణం అత్యంత విషాదం అని, ఆయనే బతికి ఉంటే ఏపీకి ఈ కన్నీళ్లు, కష్టాలు ఉండేవి కావన్నారు. రాహుల్ గాంధీ సందేశాన్ని కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా సోనియా గాంధీ కూడా ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

సాక్షిలో నో కవరేజ్..

వైఎస్ఆర్ ఘనతను చాలామంది మెచ్చుకున్న పాత వీడియోలన్నిటినీ ఈరోజు సాక్షి ప్రసారం చేస్తోంది. వైసీపీ సోషల్ మీడియా విభాగాలు కూడా ఆ పాత వీడియోలను మరోసారి పోస్ట్ చేస్తున్నాయి. అయితే దివంగత నేతను రాహుల్ గాంధీ ప్రశంసించడాన్ని మాత్రం వారు పట్టించుకోలేదు. వైఎస్ఆర్ వారసురాలిగా షర్మిలను ప్రొజెక్ట్ చేసేందుకు రాహుల్ ఆ వీడియో విడుదల చేశారనేది వారి అభియోగం. అందుకే రాహుల్ వీడియోని కానీ, సోనియా ప్రెస్ నోట్ ని కానీ వైసీపీ అనుకూల మీడియా ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టింది.

First Published:  8 July 2024 1:03 PM IST
Next Story