Telugu Global
Andhra Pradesh

పుంగనూరులో మళ్లీ ఉద్రిక్తత.. ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్

వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఈరోజు మిథున్ రెడ్డి వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న వైరి వర్గం ఒక్కసారిగా ఆ ఇంటిని చుట్టుముట్టింది.

పుంగనూరులో మళ్లీ ఉద్రిక్తత.. ఎంపీ మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్
X

చిత్తూరు జిల్లా పుంగనూరులో మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడ పదేపదే గొడవలు జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా ఇక్కడకు రానీయకుండా వైరి వర్గం అడ్డుకుంటోంది. అక్కడకు వెళ్తే గొడవలు పెద్దవవుతాయని పోలీసులు కూడా ఆయన్ని వారిస్తున్నారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డి కుమారుడు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు వచ్చారు. దీంతో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది. ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా.. ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.


వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఈరోజు మిథున్ రెడ్డి వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న వైరి వర్గం ఒక్కసారిగా ఆ ఇంటిని చుట్టుముట్టింది. అక్కడే ఉన్న వైసీపీ శ్రేణులు వారిని నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్డప్ప తమను వేధించారంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలంతా అక్కడికి వచ్చి రాళ్లదాడి చేసినట్టు తెలుస్తోంది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వారిని చెదరగొట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రెడ్డప్ప ఇంటి చుట్టూ బందోబస్తు పెంచారు. ఎంపీ మిథున్ రెడ్డిని ఆ ఇంటి నుంచి బయటకు రానీయలేదు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, మిథున్ రెడ్డిని.. పుంగనూరు రాకుండా కొన్నిరోజులుగా టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. పెద్దిరెడ్డిని పుంగనూరులో అడుగుపెట్టనివ్వబోమని సోషల్ మీడియాలో కూడా హెచ్చరికలు జారీ చేశారు టీడీపీ నేతలు. దీంతో పోలీసులు గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. పుంగనూరుకి బయటనుంచి వైసీపీ నేతల్ని రానీయకుండా సర్దిచెబుతూ వచ్చారు. ఈరోజు మిథున్ రెడ్డి రావడంతో గొడవలు మొదలయ్యాయి. తమ పార్టీ నేతల్ని కూడా కలవనీయకుండా ఈ నిర్బంధం ఏంటని మిథున్ రెడ్డి సహా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

First Published:  18 July 2024 6:30 AM GMT
Next Story