Telugu Global
Andhra Pradesh

పవన్ వ్యాఖ్యలు పుష్ప సినిమాను ఉద్దేశించి కాదు - నిర్మాత రవిశంకర్

పవన్ ఎప్పుడూ కావాలని అలా మాట్లాడారని స్పష్టం చేశారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని ఆయన అన్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ ను కలిశామని, త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.

పవన్ వ్యాఖ్యలు పుష్ప సినిమాను ఉద్దేశించి కాదు - నిర్మాత రవిశంకర్
X

ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్స్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఒక రోజు ముందు అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి ఆయన స్నేహితుడు శిల్పా రవిరెడ్డికి మద్దతు పలకడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాత జనసేనకు మద్దతు తెలిపేవాడు పరాయివాడైన మావాడు.. మద్దతు తెలపని వాడు మా వాడైన పరాయి వాడేనంటూ.. నాగబాబు చేసిన వ్యాఖ్యలు మెగా, అల్లు కుటుంబాల మధ్య దూరాన్ని పెంచాయి.

ఇటీవల కర్ణాటకలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడే పాత్రలు చేసేవారని.. ఇప్పుడు అడవులను విధ్వంసం చేసే పాత్రల్లో నటిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించి ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగింది.

ఆ తర్వాత మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ' నాకు ఇష్టమైతేనే వస్తా.. నా మనసుకు నచ్చితేనే వస్తా ' అంటూ వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు కౌంటర్ గానే అల్లు అర్జున్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి.

ఆ తర్వాత జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అల్లు అర్జున్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'జనసేన ప్రచారం కోసం నిన్ను ఎవడు రమ్మన్నాడు ' అంటూ తీవ్రంగా విమర్శించారు.

ఈ సంఘటనల తర్వాత మెగా, అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తున్న రవి శంకర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ చెట్ల నరికివేత, స్మగ్లింగ్ గురించి ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ నటించిన పుష్ప గురించి ఉద్దేశించినవి కావు అని అన్నారు. పవన్ ఎప్పుడూ కావాలని అలా మాట్లాడారని స్పష్టం చేశారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని ఆయన అన్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ ను కలిశామని, త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.

First Published:  30 Aug 2024 2:41 PM IST
Next Story