మచ్చుమర్రి ఘటన.. ఇద్దరు పోలీసులపై సస్పెన్షన్ వేటు
మచ్చుమర్రి ఘటనలో ప్రభుత్వం ఇరుకున పడింది. విచారణ ఆలస్యం కావడంతో ప్రతిపక్షం విమర్శల జోరు పెంచింది. దీంతో పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం తొలిసారిగా పనితీరు సరిగా లేదనే కారణంతో ఇద్దరు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. నంద్యాల జిల్లా నంది కొట్కూరు రూరల్ సీఐ విజయ భాస్కర్, మచ్చుమర్రి ఎస్సై జయశేఖర్ ని సస్పెండ్ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ వారిద్దరిపై వేటు వేశారు అధికారులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు పలు రాజకీయ కారణాలతో బదిలీలు జరిగాయి, కొంతమందిని విధులకు దూరంగా ఉంచారు. తాజాగా విధి నిర్వహణలో అలసత్వం కారణంతో ఎస్సై, సీఐపై సస్పెన్షన్ వేటు పడటం గమనార్హం.
మచ్చుమర్రిలో మైనర్ బాలిక హత్యోదంతం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే ఆమెను హత్య చేసింది ఎవరనేది కనిపెట్టగలిగారు కానీ, మృతదేహాన్ని మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోయారు. నిందితులు దొరికినా వారిచ్చిన తప్పుడు సమాచారంలో పోలీసులు కొన్నిరోజులుగా మృతదేహాన్ని గాలిస్తూనే ఉన్నారు. మరోవైపు బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమ కుమార్తె చనిపోయిందని అంటున్నారు కానీ, ఆమె మృతదేహం చూపించలేకపోతున్నారని, అసలేం జరిగిందని వారు నిలదీస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీ కూడా ఇదే విషయంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. వైసీపీ హయాంలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పిన టీడీపీ.. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చేసిందేంటని..? సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ మొదలైంది. దీంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు వేసింది.
కూటమి అధికారంలోకి వచ్చాక ఒకటి రెండు దుర్ఘటనల విషయంలో హోం మంత్రి వంగలపూడి అనిత వెంటనే రియాక్ట్ అయ్యారు. బాధితుల వద్దకు నేరుగా వెళ్లి ఆమె పరామర్శించారు. బాధితులకు ఆర్థికసాయం కూడా చేశారు. మచ్చుమర్రి ఘటనలో మాత్రం ప్రభుత్వం ఇరుకున పడింది. విచారణ ఆలస్యం కావడంతో ప్రతిపక్షం విమర్శల జోరు పెంచింది. దీంతో పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.