ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మోదీ కృషి చేస్తున్నారు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారు, ఆయన ప్రపంచం మెచ్చిన ఏకైక నాయకుడు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం సాయంత్రం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో 2.08 లక్షల కోట్లతో చేపట్టబోయే పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేశారు. మరికొన్ని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ కూటమి 93 శాతం స్ట్రయిక్ రేట్ తో ఘన విజయం సాధించిందని, భవిష్యత్ లోనూ ఈ కాంబినేషన్ కొనసాగుతుందన్నారు. భవిష్యత్‌లోనూ ప్రధానిగా నరేంద్రమోదీనే ఉంటారని.. వచ్చే ఎన్నికల్లోనూ ఎన్‌డీఏ గెలస్తుందని రాసిపెట్టుకోండని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన ఇవే మోదీ నినాదాలన్నారు. మేకిన్ ఇండియాతో దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, గతి శక్తి లాంటి కార్యక్రమాలు తీసుకువచ్చారన్నారు. దేశానికి ముంబయి ఆర్థిక రాజధాని అయితే.. ఏపీకి వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నారు.
సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తాం
ప్రధాని మోదీ త్వరలోనే అమరావతిలో పర్యటించాలని కోరుతున్నానని అన్నారు. నదుల అనుసంధానమే తమ లక్ష్యమని.. దీనికి కేంద్రం సహకారం కావాలన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే ఫస్ట్, సెకండ్ ప్లేసుల్లో ఏదో ఒక స్థానానికి భారత్ చేరుతుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని.. కేంద్రం సాయంతో నిలదొక్కుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని.. ఆ బాధ్యత తమదేనన్నారు. కేంద్రం సహకారంతో ఏపీలో పెట్టుబడులు ఊపందుకున్నాయని, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్లుగా మారుతున్నాయని తెలిపారు. అరుకు కాఫీని మోదీ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఏ సమస్య చెప్పినా ప్రధాని అర్థం చేసుకుంటారని.. వెంటనే పనులు జరిగేలా చొరవ చూపుతారని అన్నారు. ఇదివరకు ఇంతలా చొరవ చూపించిన ప్రధాని మరొకరు లేరన్నారు. భారత్ కు రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేశ్, అనిత, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.