Telugu Global
Andhra Pradesh

వాళ్లది శునకానందం

పోలీసులను వాడుకుని వైసీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు పేర్ని నాని. బెయిల్ రాకుండా చేయడానికి సెక్షన్లు మార్చి జైళ్లలో ఉంచుతున్నారన్నారు.

వాళ్లది శునకానందం
X

తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు బ్యాచ్ శునకానందం పొందుతోందని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. గతంలో కొడాలి నానికి క్యాన్సర్ అని ప్రచారం చేశారని, ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారంటూ వార్తలు వేసి శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. వంశీ న్యాయం కోసం పోరాడుతున్నారని, కచ్చితంగా బెయిల్ తీసుకుని వంశీ వస్తారన్నారు. టీడీపీ చేస్తున్న మోసాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రజాపోరాటం చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు పేర్ని నాని.


ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు మంచి చేయడం మానేసి, వైసీపీ జెండా మోసిన కార్యకర్తల్ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారని అన్నారు నాని. వైసీపీ కార్యకర్తలతో జైళ్లను నింపే కార్యక్రమం చేస్తున్నారన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై నూజివీడు సబ్ జైలులో ఉన్న వైసీపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం కూడా జైలుకి వెళ్లి కార్యకర్తల్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అక్రమ కేసులతో వారిని జైలులో పెట్టారని, వారిని బెయిల్ పై విడిపించేందుకు పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ జెండా పక్కన పెట్టేది లేదని కార్యకర్తలు చెబుతున్నారని అన్నారు నేతలు.

పోలీసులను వాడుకుని వైసీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు పేర్ని నాని. బెయిల్ రాకుండా చేయడానికి సెక్షన్లు మార్చి జైళ్లలో ఉంచుతున్నారన్నారు. ఏడాది క్రితం జరిగిన ఘటనలో ఇప్పుడు అరెస్ట్ లు ఏంటని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా వైసీపీ కార్యకర్తలు ఎక్కడా వెనక్కి తగ్గరని చెప్పారు నాని.

First Published:  3 Aug 2024 2:08 PM IST
Next Story