Telugu Global
Andhra Pradesh

ప్రజల చేత ఎన్నికై.. ఆ ప్రజలనే అవమానిస్తావా?

చంద్రబాబు మెప్పు పొందాలని నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. 40 శాతం ప్రజలు విజ్ఞతతోనే వైసీపీకి ఓటేశారని, కూటమి పేరుతో మూడు పార్టీలూ కలిసి ఎలా గెలిచాయో దేవుడికే తెలుసని ఆయన చెప్పారు.

ప్రజల చేత ఎన్నికై.. ఆ ప్రజలనే అవమానిస్తావా?
X

సాక్షాత్తూ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఓటర్లపై నోటికొచ్చినట్టు మాట్లాడిన తీరు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. రాష్ట్ర ప్రజలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు అందరినీ తీవ్ర విస్మయానికి గురిచేశాయి. ‘వైసీపీకి కూడా 40 శాతం మంది ఓట్లు వేశారంటే వాళ్లు అన్నం తినే వేశారా? మనసుతో ఆలోచించి ఓటు వేశారా? ఏవిధంగా ఓటు వేశారో అర్థం కావట్లేదు. వారి ఐదేళ్ల పరిపాలనను చూసిన తర్వాత కూడా ఈ విధంగా ఓట్లు వేయడంపై ఆలోచించాలి’ అంటూ విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలపై జనం మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నికైన నాయకుడు సాక్షాత్తూ శాసనసభలో ప్రజలపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఇప్పటికే తీవ్రంగా ఖండించారు. మరోపక్క దక్షిణ భారత క్షత్రియ ఫెడరేషన్‌ ఈసీ మెంబర్‌ రాజాసాగి లక్ష్మీనరసింహరాజు కూడా బుధవారం విష్ణుకుమార్‌రాజు తీరును దుయ్యబట్టారు. ఎమ్మెల్యే విష్ణు కుమార్‌రాజు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తెలుగు ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు మెప్పు పొందాలని నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. 40 శాతం ప్రజలు విజ్ఞతతోనే వైసీపీకి ఓటేశారని, కూటమి పేరుతో మూడు పార్టీలూ కలిసి ఎలా గెలిచాయో దేవుడికే తెలుసని ఆయన చెప్పారు.

ప్రజలు అన్నమే తింటున్నారు.. నువ్వు ఏం తింటున్నావో ఒకసారి చూసుకో.. అంటూ ఆయన విష్ణుకుమార్‌రాజును దుయ్యబట్టారు. నువ్వు అన్నమే తింటే అలా మాట్లాడేవాడివి కాదు.. అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నికైన నువ్వు ఆ ప్రజలనే అవమానిస్తావా? నీకు సిగ్గే ఉంటే, అన్నమే తింటే.. వెంటనే 40 శాతం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే భవిష్యత్తులో నీకు ఘోర అవమానం తప్పదు.. అంటూ హెచ్చరించారు.

First Published:  25 July 2024 7:26 AM GMT
Next Story