పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం
సంక్రాంతి పండుగ వేళ పల్లెలు పిల్లా పాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉన్నదన్న ఏపీ డిప్యూటీ సీఎం

పండుగ సందడితో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పల్లెలు శోభాయమానంగా మారాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పుణ్య సమయాన ధాన్య రాశులను లోగిళ్లకు మోసుకు వచ్చే సంక్రాంతి వేళ భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రంగవల్లులు.. గొబ్బెమ్మలు.. గంగిరెద్దులు.. హరిదాసులు... భోగిమంటలు.. పిండి వంటల సమ్మేళనమే సరదాల సంక్రాంతి. సరదాల కోసం నగరాలన్నీ పల్లెలవైపు పరుగులు తీశాయి. ఇది ప్రజలకు పండుగపై ఉన్న మక్కువను తెలియజేస్తున్నది. ఉపాధి కోసం పల్లె బిడ్డలు నగరాలకు వలసపోవడంతో గ్రామాలు జనాలు లేక కొంతవరకు పలచబడినాయి. ఈ సంక్రాంతి పండుగ వేళ పల్లెలు పిల్లా పాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉన్నది. పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం. ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా శోభిల్లాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పవన్ తెలిపారు.