పీఏసీ ఛైర్మన్ పదవికి పెద్దిరెడ్డి నామినేషన్!
పీఏసీలో సభ్యుడిగా ఎన్నికయ్యే సంఖ్యా బలం వైసీపీకి లేదు. దీంతో ఆసక్తికరంగా మారిన ఛైర్మన్ పదవి
ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవికి నామినేషన్ వేయాలని వైసీపీ నిర్ణయించింది. విపక్ష పార్టీకే ఆ పదవి ఇవ్వాలని కోరుతున్నది. ఈ నేపథ్యంలో ఛైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో నామినేషన్ వేయించాలని భావిస్తున్నది. ఇప్పటికే ఆయన అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. కాసేపట్లో ఆయన నామినేషన్ వేసే అవకాశం ఉన్నది. నామినేషన్లు దాఖలు చేయడానికి నేటి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమయం ఉన్నది.
పీఏసీలో సభ్యుడిగా ఎన్నిక కావాలంటే 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ప్రస్తుతం వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ నేపథ్యంలో పీఏసీ ఛైర్మన్ పదవికి నామినేషన్ వేయాలని వైసీపీ నిర్ణయించడంతో ఉత్కంఠ నెలకొన్నది. ప్రజాపద్ధుల కమిటీలో 12 మంది సభ్యులుంటారు. శాసనసభ నుంచి 9 మంది, మండలి నుంచి ముగ్గురు ఉంటారు. శానసభ్యుల నుంచే ఛైర్మన్ నియమితులవుతారు. శాసనసభ స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకుంటారు. గత శాసనసభలో టీడీపీకి ఒక్క సభ్యుడినే ఎన్నుకునే బలం ఉన్నది. దీంతో పయ్యావుల కేశవ్‌కు ఆ సభ్యుడిగా అవకాశం దక్కింది. సంప్రదాయం ప్రకారం ఆయననే చైర్మన్‌గా నియమించారు. ప్రస్తుతం ప్రతిపక్ష వైసీపీ నుంచి ఒక్క సభ్యుడూ ఎన్నికయ్యే అవకాశం లేదు. ఈ క్రమంలో ఛైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.