ఎవ్వర్నీ వదిలే ప్రసక్తే లేదు.. మంత్రి నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు
గతంలో ఎవరైతే మనపై దాడులు చేశారో, ఎవరైతే వీరమహిళల్ని, జనసైనికుల్ని ఇబ్బంది పెట్టారో.. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని అన్నారు నాదెండ్ల మనోహర్.
ఓవైపు ఏపీలో రాజకీయ దాడులు పెచ్చుమీరాయి, నడిరోడ్డుపై చేతులు, కాళ్లు నరికివేస్తున్న దారుణాలు, వాటికి సంబంధించిన వీడియోలు చూస్తూనే ఉన్నాం. ఈ దశలో నాయకులెవరైనా కార్యకర్తలకు ఏమని చెప్పాలి. సంయమనం పాటించండి, గొడవలు వద్దు అని చెబుతారని ఆశిస్తాం. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్ అయింది. మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు నేతలు. పౌరసరఫరాల శాఖ మంత్రి జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. వ్యాఖ్యలు తాజాగా సంచలనంగా మారాయి.
మనపై గతంలో దాడులు చేసిన వారిని ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదు
— Telugu360 (@Telugu360) July 18, 2024
- జనసైనికులతో మంత్రి నాదేండ్ల@JanaSenaParty pic.twitter.com/V4ZpXYRUXl
ఎవ్వర్నీ వదిలిపెట్టం..
గతంలో ఎవరైతే మనపై దాడులు చేశారో, ఎవరైతే వీరమహిళల్ని, జనసైనికుల్ని ఇబ్బంది పెట్టారో.. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని అన్నారు నాదెండ్ల మనోహర్. విజయవాడలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వారు మరింత ఆవేశపడితే దానికి బాధ్యులు ఎవరు..? మన వెనక పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఉన్నారులే, అంతా వారే చూసుకుంటారని జనసైనికులు దాడులకు తెగబడితే నష్టపోయేది ఎవరు..? అసలే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పేలా ఉన్నాయి. ఈ దశలో ఆయన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.
తగ్గేదే లేదు..
ఏపీలో దాడులు పెచ్చుమీరినా, ఏ పార్టీ కూడా తగ్గేది లేదంటోంది. దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవాలని ఎవరూ చెప్పరు. అదే సమయంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కూడా తప్పే. ఎన్ని ఎక్కువ కేసులుంటే వారికి అంత ప్రయారిటీ ఇస్తామంటూ గతంలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎన్నికల వేళ ప్రజల్ని రెచ్చగొట్టి నేతలు పబ్బం గడుపుకున్నారని, ఆ మాటలకు ప్రభావితమై అమాయక ప్రజలు ఇప్పుడు దాడులకు తెగబడుతున్నారని విమర్శలు వినపడుతున్నాయి. ఏపీలో పరిస్థితులు కుదుటపడే వరకు రాజకీయ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేయకూడదనే సలహాలు కూడా వినపడుతున్నాయి.