60 రోజుల్లో 36 హత్యలు..!
ఏపీ సీఎం, తెలంగాణ సీఎం మధ్య స్నేహం ఉందని, అయితే ఆ స్నేహం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా ఉంటే మాత్రం తాము అంగీకరించబోమన్నారు విజయసాయిరెడ్డి.

పార్లమెంట్ లో ఏపీ శాంతి భద్రతల అంశాన్ని మరోసారి ప్రముఖంగా ప్రస్తావించారు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. ఏపీలో రోజుకో హత్య జరుగుతోందని అన్నారాయన. ఈ హత్యలకు ఎవరు కారకులో అందరికీ తెలుసని, అయితే పోలీస్ వ్యవస్థ నేరస్తులకే వత్తాసు పలుకుతోందని విమర్శించారు. కూటమి 60రోజుల పాలనలో 36 రాజకీయ హత్యలు జరిగాయని రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు విజయసాయి. వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.
ఏపీలో శాంతి భద్రతల పరిస్థితిని మెరుగుపరచాలని కోరారు విజయసాయిరెడ్డి. హోం శాఖకు తగినన్ని నిధులు కేటాయించాలన్నారు. వాగ్నర్ గ్రూప్ తరహాలో ఏపీలో హత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇక కేంద్ర బడ్జెట్ లో ఏపీలోని పోలవరం ప్రాజెక్ట్ కి నిధులు కేటాయంచలేదని గుర్తు చేశారాయన. నిధులు లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణం ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
ఆ స్నేహంతో ప్రమాదం..
తెలంగాణ నుంచి ఏపీ జెన్‌కోకు రూ. 7000 కోట్ల బకాయిలు రావాలని, వాటిని ఏపీకి చెల్లించాలని కేంద్రం కూడా తెలంగాణకు ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. ఒకవేళ తెలంగాణ బకాయిలు ఇవ్వలేకపోతే.. ఆ రాష్ట్రానికి పన్నుల వాటాలో కోత విధించాలని సూచించారు. ఏపీ సీఎం, తెలంగాణ సీఎం మధ్య స్నేహం ఉందని, అయితే ఈ స్నేహం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా ఉంటే మాత్రం తాము అంగీకరించబోమన్నారు విజయసాయిరెడ్డి.