తిరుమలలోని అన్నప్రసాద వంటశాలల ఆధునికీకరణ
మెకనైజేషన్‌తో పాటు వంశాలలను పూర్తిగా మార్చడానికి ముందుకొచ్చిన టీవీఎస్ మోటార్స్..ఒప్పందం చేసుకోనున్న టీటీడీ
తిరుమలలోని వంటశాలల ఆధునికీకరణతో పాటు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించడానికి కొత్త పరికరాల ఏర్పాటునకు టీటీడీ సిద్ధమవుతున్నది. ఇందులోభాగంగా పరికరాల యాంత్రీకరణ (మెకనైజేషన్)తో పాటు వంశాలలను పూర్తిగా మార్చడానికి టీవీఎస్ మోటార్స్( టీవీఎస్‌ఎం ) తో ఒప్పందం చేసుకోనున్నది. మొదటివిడత పైలట్ ప్రాజెక్టు కింద మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నదాన సత్రం (ఎంటీవీఏసీ) పనులు చేపట్టనున్నారు. సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన సందర్భంగా వంటశాలను ఆటోమేట్ చేసే ప్రక్రియను చేపట్టాలని అధికారులకు సూచించాఉ. 30 నిమిషాల్లోనే అన్నప్రసాదాలు అందించే దిశగా పరికరాలు, వంట చేసే ప్రక్రియ, ఆహార పంపిణీ వంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. దీనిలో భాగంగా టీవీఎస్ ప్రతినిధులకు అక్టోబర్ 24,25 తేదీల్లో తిరుమలలోని ఎంటీవీఏసీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్స్, ఔటర్ రోడ్డులోని క్యూలైన్లు, కొత్తగా నిర్మించిన వకళమాత కేంద్రీకృత వంటశాల, పద్మావతి అతిథిగృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంటీవీఏసీ ప్రత్యేక అధికారి అక్కడ ఉన్న పరికరాలు, అన్నప్రసాదం తయారీ విధానాన్ని టీవీఎస్ ప్రతినిధులకు వివరించారు.
అధికారులతో చర్చించిన అనంతరం అక్కడ మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నదాన సత్రంలో పైలట్ ప్రాతిపదికన ఆధునికీకరణ, మెకనైజేషన్ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. టీటీడీతో ఎంవోయూ చేసుకోవడానికి టీవీఎస్‌ఎం ముందుకు వచ్చింది. తిరుమల శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించడానికి 2011 ఎంటీవీఏసీని నిర్మించారు. అన్నప్రసాద వంటశాలను పూర్తిగా ఆధునికీకరించడానికి అవసరమైన అన్ని ప్రతిపాదనలను, డిజైన్లను టీవీఎస్‌ఎం అందించనున్నది. పరకరాలను సరఫరా చసే కాంట్రాక్టర్లను గుర్తించి టీటీడీకి సమాచారం ఇవ్వనున్నది. వంటశాలను పూర్తిగా మార్చే నైపుణ్యం ఉన్న కన్సల్టెంట్లను టీవీఎస్‌ఎం చూడనున్నది. వీరికి నిధులను ఆ సంస్థే భరిస్తుంది. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును ఇవ్వనున్నది. ఈ నేపథ్యంలో టీవీఎస్‌ఎంతో ఒప్పందం చేసుకోవడానికి టీటీడీ సిద్ధమైంది.