Telugu Global
Andhra Pradesh

'సేవ్‌ తిరువూరు' ర్యాలీ విరమించుకున్న ఎమ్మెల్యే కొలికపూడి

పార్టీ అధిష్ఠానం ఆదేశంతో వెనక్కి తగ్గిన తిరువూరు ఎమ్మెల్యే

సేవ్‌ తిరువూరు ర్యాలీ విరమించుకున్న ఎమ్మెల్యే కొలికపూడి
X

టీడీపీ హైకమాండ్‌ ఆదేశాలతో సోమవారం సాయంత్రం 4 గంటలకు చేపట్టిన 'సేవ్‌ తిరువూరు' ర్యాలీ విరమించుకున్నట్లు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో 'సేవ్‌ తిరువూరు' పేరుతో ర్యాలకి కొలికపూడి పిలుపునిచ్చారు. ర్యాలీ విరమించుకోవాల్సిందిగా ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారని, ర్యాలీ విరమించుకున్నట్లు ఆదివారం సాయంత్రం వీడియో విడుదల చేశారు.

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. తిరువూరు నుంచి తరలివచ్చిన మీడియా ప్రతినిధులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. మీడియా ప్రతినిధులను కించపరిచేలా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని తెలిపారు. కొలికపూడి బెదిరించారంటూ కొన్ని ఆధారాలను ముఖ్యమంత్రికి అందజేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు అన్ని విషయాలు తెలుసున్న సీఎం.. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

టీడీపీ అంటే క్రమశిక్షణకు మారు పేరు అని చంద్రబాబు అండ్‌ కో గప్పాలు కొట్టుకుంటారు. కానీ ఆ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారశైలి వివాదాస్పదమవుతున్నది. పార్టీపై చంద్రబాబు పట్టుకోల్పోతున్నారా? అనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. కొలికపూడి వైఖరి పార్టీ అధినేత చంద్రబాబుకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. అటు ప్రజలు, మీడియా ప్రతినిధుల నుంచి ఆయనపై వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. పుండు మీద కారం చల్లినట్టు 'సేవ్‌ తిరువూరు' కొలికపూడి ర్యాలీ చేస్తే అది పార్టీకి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతుందని ఆ పార్టీ అధిష్ఠానం భావించింది. అందుకే ర్యాలీ విరమించుకోవాల్సిందిగా ఆదేశించిందని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు.

First Published:  29 Sept 2024 1:54 PM GMT
Next Story