Telugu Global
Andhra Pradesh

ఏపీలో ఫ్రీ బస్.. పోస్టు పెట్టి డిలీట్ చేసిన మంత్రి

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత RTC ప్రయాణం మొదలు కాబోతోందంటూ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో అనగాని సత్య ప్రసాద్ పోస్టు పెట్టారు.

ఏపీలో ఫ్రీ బస్.. పోస్టు పెట్టి డిలీట్ చేసిన మంత్రి
X

ఏపీలో సూపర్ సిక్స్‌ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారా.. అని జనం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఉచిత బస్సు పథకం, నెలకు రూ.1500 ప‌థ‌కం అమ‌లు ఎప్పుడా అని ఆత్రుత‌గా ఉన్నారు. అలాగే రైతులు.. ఎన్టీఆర్ రైతు భరోసా కోసం నిరీక్షిస్తున్నారు. తల్లులు తల్లికి వందనం, నిరుద్యోగులు నిరుద్యోగ భృతి, ఫ్యామిలీలు 3 ఉచిత సిలిండర్ల కోసం చూస్తున్నాయి. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన కేబినెట్‌ భేటీపై జనాల్లో ఆసక్తి నెలకొంది. కానీ, హామీల అమలుపై కేబినెట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అయితే కేబినెట్ భేటీ జరుగుతున్న టైమ్‌లోనే సోషల్‌ మీడియా వేదికగా మంత్రి అనగాని సత్య ప్రసాద్ చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత RTC ప్రయాణం మొదలు కాబోతోందంటూ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో అనగాని సత్య ప్రసాద్ పోస్టు పెట్టారు. వాస్తవానికి ఈయవ రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి. రవాణాశాఖతో ఈయనకు ఏ సంబంధమూ లేదు. ప్రభుత్వం నుంచి కూడా ఫ్రీ బస్సు పథకం అమలుపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో మంత్రి అనగాని పెట్టిన పోస్టుపై తీవ్ర చర్చ జరిగింది. దీంతో వెంటనే ఆయన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పెట్టిన పోస్టుల్ని డిలీట్ చేశారు. ఫ్రీ బస్సుపై ఆయన పోస్టు ఎందుకు పెట్టారు, మళ్లీ ఎందుకు డిలీట్ చేశారు అనేది ఆసక్తికరంగా మారింది.

First Published:  16 July 2024 4:58 PM IST
Next Story