ఏపీలో సంచలనం.. బియ్యం మాఫియాలో ఐదుగురు ఐపీఎస్ ల పాత్ర
రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్. వారందరిపై విచారణ మొదలయ్యే అవకాశాలున్నాయి.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బియ్యం మాఫియాకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారని చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్. స్వయంగా ఆయన కూడా తనిఖీలకు వెళ్తున్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పేదలకు ఇస్తున్న సరుకుల నాణ్యత, వాటి బరువుని ఆయనే స్వయంగా చెక్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తాజాగా ఓ సంచలన ప్రకటన చేశారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని చెప్పారాయన.
విజయవాడ రైతు బజార్లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన బియ్యం, కందిపప్పు తక్కువ ధరలకు ప్రజలకు అందించేందుకు ప్రత్యేక అమ్మకాల కౌంటర్ ప్రారంభించిన రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ @mnadendla గారు.
— JanaSena Party (@JanaSenaParty) July 11, 2024
Live Link: https://t.co/ehoYAN3T1Q
ఏకంగా ఐదుగురు ఐపీఎస్ అధికారులకు బియ్యం మాఫియాతో సంబంధాలున్నాయంటే అది సంచలన విషయమే. వారందరిపై విచారణ మొదలయ్యే అవకాశాలున్నాయి. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి. రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్లు త్వరలో చెల్లిస్తామని చెప్పారు.
రాయితీపై మరిన్ని సరుకులు..
నాణ్యమైన బియ్యం, కందిపప్పుని రాయితీ ధరలకు రైతు బజార్లలో అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజార్లో తొలి కౌంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఇక్కడ ఒక్కొక్కరికి కిలో కందిపప్పు, 5 కిలోల బియ్యం మాత్రమే అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో పంచదార సహా చిరుధాన్యాలను కూడా రైతు బజార్ల ద్వారా రాయితీపై పంపిణీ చేస్తామని తెలిపారు నాదెండ్ల.