Telugu Global
Andhra Pradesh

ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా

నాలుగు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం

ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా
X

ఏపీలో మెగా డీఎస్సీ ప్రకటన వాయిదా పడింది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం బుధవారం నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉండగా.. పలు అనివార్య కారణాలతో అధికారులు వాయిదా వేశారు. మరో నాలుగు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. నోటిఫికేషన్‌ విడుదల వాయిదాతో అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు.

నిజానికి నవంబర్‌ 3వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలవుతుందని ప్రచారం జరిగింది. అయితే అప్పటికి ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ విదేశీ పర్యటనలో ఉండటంతో కాస్త ఆలస్యంగా విడుదలవుతుందని విద్యాశాఖవర్గాలు వెల్లడించాయి. నవంబర్‌ 4న సోమవారం ఏపీ టెట్‌ విడుదలైన సంగతి తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలో 6న (నేడు) డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడుతుందని పాఠశాల విద్యాశాఖ సమాచారం ఇచ్చింది. అయితే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల అమలుపై ఎమ్మార్పీఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని, కొత్త నోటిఫికేషన్లు జారీ చేయవద్దని ఎమ్మార్పీఎస్‌ డిమాండ్‌ చేస్తున్నది. మంగళవారం (నవంబర్‌ 5) ఏపీ సీఎం చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి పలు అంశాలను సీఎంతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రకటన వాయిదా పడటానికి రిజర్వేషన్ల అంశమే కారణమా అనే చర్చ జరుగుతున్నది.

First Published:  6 Nov 2024 4:11 AM GMT
Next Story