Telugu Global
Andhra Pradesh

సెజ్‌లో భారీ పేలుడు ఘటనలో 17 మంది మృతి.. 60 మందికి పైగా గాయాలు

పేలుడు సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు. కాలిపోయిన కార్మికుల మృతదేహాలు కొన్ని గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి.

సెజ్‌లో భారీ పేలుడు ఘటనలో 17 మంది మృతి.. 60 మందికి పైగా గాయాలు
X

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో జరిగిన భారీ పేలుడు ప్ర‌మాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటనలో మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఎసెన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీలో ఈ పేలుడు జరగగా, ఆ ధాటికి కంపెనీ పైకప్పు కూలిపోయి పనిచేసే కార్మికులపై పడింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు ఎక్కువమంది చనిపోయారు. మందుల తయారీలో ఉపయోగించే 500 కేఎల్‌ సామర్థ్యం గల రియాక్టర్‌ బుధవారం మధ్యాహ్నం పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఏసీ యూనిట్లకు మంటలు అంటుకుని క్షణాల్లో వ్యాపించాయి. పేలుడు సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు. కాలిపోయిన కార్మికుల మృతదేహాలు కొన్ని గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి.

ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పొక్లెయిన్‌తో శిథిలాలను తొలగించి మృతదేహాలను గుర్తించారు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో అచ్యుతాపురం, అనకాపల్లి, విశాఖపట్నంలోని ఆస్ప‌త్రులకు తరలించారు. మధ్యాహ్నం ‘ఎ’ షిఫ్ట్‌ విధులు ముగించి, ‘బి’ షిఫ్ట్‌ ఉద్యోగులు విధులకు హాజరయ్యే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువ జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమయంలో షిఫ్ట్‌లో 381 మంది కార్మికులు ఉన్నట్టు గుర్తించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు వెల్లడించారు.

First Published:  22 Aug 2024 2:34 AM GMT
Next Story