Telugu Global
Andhra Pradesh

సంపద సృష్టి.. ఏది..? ఎక్కడ..?

సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ఎత్తేస్తాడనిపిస్తోందని ఎద్దేవా చేశారు భరత్. చంద్రబాబుకంటే డ్రామాలాడేవారే నయం అని కౌంటర్ ఇచ్చారు.

సంపద సృష్టి.. ఏది..? ఎక్కడ..?
X

సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పటి వరకు ఏమీ సృష్టించలేకపోయారని విమర్శించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా తల్లికి వందనం కోసం ఎదురుచూస్తున్నారని, అన్నదాతలు రైతు భరోసా ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. వాలంటీర్లకు 10వేల రూపాయల గౌరవ వేతనం ఎక్కడని నిలదీశారు. అసలు వాలంటీర్ వ్యవస్థనే నిర్మూలించడం దారుణం అన్నారు. మొత్తంగా సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ఎత్తేస్తాడనిపిస్తోందని ఎద్దేవా చేశారు భరత్. చంద్రబాబుకంటే డ్రామాలాడేవారే నయం అని కౌంటర్ ఇచ్చారు.


ఆమాటకు అర్థం అదేనా..?

నిధులు లేవు, ప్రజలు ఆలోచన చేయాలని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నారని దాని అర్థం ఏంటని ప్రశ్నించారు మార్గాని భరత్. ఆలోచన చేయాలంటే సూపర్ సిక్స్ ఎగ్గొట్టినట్టేనని అర్థం చేసుకోవాలా అని అడిగారు. మూడు సిలిండర్లు ఇవ్వలేమని మంత్రి నాదెండ్ల మనోహర్ నేరుగా చెప్పేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. తల్లికి వందనం కోసం లెక్కలు తీయాలంటూ నారా లోకేష్ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. అసలు ప్రజలు చంద్రబాబు మాయలో ఎలా పడ్డారో అర్థం కావడంలేదన్నారు భరత్.

ఏరియల్ సర్వే చేయరా..?

వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు భరత్. బాధితులకు ప్రభుత్వం నిత్యవసరాలు పంపిణీ చేయడం లేదని, కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదని మండిపడ్డారు. కేవలం ఫొటోలు దిగి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారని, సహాయక చర్యలు జరగలేదని అన్నారు. తమ హయాంలో వరదలు వస్తే వెంటనే రేషన్ సరకులు పంపిణీ చేసేవారమని, పరిహారంలో కూడా తమ ప్రభుత్వం ముందుండేదని చెప్పారాయన. కూటమి ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే కూడా చేయలేదని విమర్శించారు భరత్.

First Published:  3 Aug 2024 8:08 AM GMT
Next Story