తీరానికి సమీపంలోనే అల్పపీడనం
గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారుల హెచ్చరికలు
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి తీరానికి సమీపంలోనే ఉన్నదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీరం వద్దే ఉండటం వల్ల ఆకాశం మేఘావృతమై ఉన్నట్లు తెలిపింది. మరో రెండు రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుందని, 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వచే అవకాశం ఉన్నదిని పేర్కొన్నది. విశాఖ పోర్టులో మూడో నెంబర్ సాధారణ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొన్నది.
పశ్చిమ గాలుల ప్రభావంతో
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 16న అల్ప పీడనం ఏర్పడింది. తర్వాత వాయుగుండంగా బలపడి, తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని నిపుణులు భావించారు. తర్వాత రెండు రోజులకు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఏపీ తీరం వైపు వచ్చింది. మరో రెండు రోజులకు వాయుగుండంగా మారింది. శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. సుమారు వారం రోజులుగా అల్పపీడనం కొనసాగుతున్నది. ఉత్తర భారతం నుంచి వచే పశ్చిమ గాలుల ప్రభావంతో వాయుగుండం ఉత్తర కోస్తా (ఏపీ) తీరం వెంబడి ప్రయాణించిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వాటి ప్రభావం తగ్గడంతో మళ్లీ దిశ మార్చుకుందని అంటున్నారు. దీని ప్రభావంతో సుమారు ఐదు రోజులుగా మత్స్యకారుల పడవలు ఒడ్డుకే పరిమితమయ్యారు.