బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీలో భారీ వర్షాలకు అవకాశం
రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వానలు పడే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం
దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, అసోం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మహారాష్ట్ర సహా ఉత్తర బంగాళాఖాతం నుంచి రుతు పవనాలు క్రమంగా వైదొలుగుతున్నాయని పేర్కొన్నది. మరో రెండు రోజుల్లో రుతు పవనాలు బలహీనపడే పరిస్థితులు మారుతున్నాయని తెలిపింది.
ఇదే సమయంలో దక్షిణ భారతదేశ ద్వీపకల్పం మీదుగా తూర్పు, ఈశాన్య గాలులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలతో పాటు మధ్య బంగాళాఖాతంలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. నైరుతి బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, అక్టోబర్ 14 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని వెల్లడించింది. మరో 48 గంటల్లో ఇది మరింత బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపు కదిలే అవకాశం ఉన్నది. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వానలు పడే అవకాశం ఉందని పేర్కొన్నది. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలకూ అవకాశం ఉన్నట్లు తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అక్టోబరు 14 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వి.అనిత జిల్లా కలెక్టర్లు, పోలీసు శాఖ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్)ను అప్రమత్తం చేశారు.