Telugu Global
Andhra Pradesh

'స్వర్ణాంధ్ర @ 2027' విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ

'పది సూత్రాలు.. ఒక విజన్‌' పేరిట డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

స్వర్ణాంధ్ర @ 2027 విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ
X

ఐశ్వర్య, ఆరోగ్య, ఆనందాంధ్రప్రదేశ్‌ (వెల్దీ, హెల్దీ, హ్యాపీ) సాకారమే లక్ష్యంగా 'స్వర్ణాంధ్ర @ 2027' విజన్‌ డాక్యుమెంట్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు పాల్గొన్నారు. 'పది సూత్రాలు.. ఒక విజన్‌' పేరిట డాక్యుమెంట్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. జాతికి, రాష్ట్ర ప్రజలకు ఇది అంకితమని రాసి సంతకం చేశారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. డాక్యుమెంట్‌ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అన్నారు. ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగిందని నేడు పనిచేస్తుంటే తెలుస్తున్నదన్నారు. పరిపాలన ప్రారంభించిన ఆరు నెలల్లోనే విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామన్నారు. దేశానికి అంకితం చేశామంటే.. ప్రజల పట్ల మాకున్న బాధ్యతకు నిదర్శనమని చంద్రబాబు తెలిపారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్‌ 1గా నిలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలవాలనే సంకల్పంలో ముందుకు వెళ్తున్నాం. నేడు 3 వేల డాలర్ల కంటే తక్కువ తలసరి ఆదాయం ఉందన్నారు.

అందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం స్వర్ణాంధ్ర విజన్‌ 2047 లక్ష్యం. పేదరికం లేని సమాజం అనేది మంతంగా తయారు కావాలి. ఆర్థిక అసమానతలను తగ్గించాలి. పీ4 విధానంలో పేదరిక నిర్మూలన చేయాలి. నాడు విజన్‌ 2020 సంకల్పంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి ఐటీ ఉద్యోగి వచ్చారు. విజన్‌ 2047 లో భాగంగా ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్త తయారుకావాలి. ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్ష్యం. పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ ఉద్యోగాలిప్పించే దిశగా కృషి చేస్తున్నాం. నైపుణ్య శిక్షణ ఇప్పించి.. మానవ వనరులను అభివృద్ధి చేస్తాం. నీటి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలనే కరువు రహిత ఏపీకి శ్రీకారం చుడుతున్నాం. వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానించే అంశాన్ని విజన్‌లో చేర్చామని చంద్రబాబు అన్నారు.

First Published:  13 Dec 2024 1:50 PM IST
Next Story