Telugu Global
Andhra Pradesh

వైసీపీ ఆఫీస్‌ కూల్చివేత ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు

అధికారులు లేవనెత్తిన ప్రతి అభ్యంతరానికీ సమాధానం ఇచ్చామని, ఒక్క దాన్ని కూడా కనీస స్థాయిలో పరిగణనలోకి తీసుకోలేదని, సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని వివరించారు.

వైసీపీ ఆఫీస్‌ కూల్చివేత ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు
X

కర్నూలులోని వైసీపీ ఆఫీస్‌ బిల్డింగ్‌ కూల్చివేతకు మున్సిపల్‌ కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలులోని వైసీపీ ఆఫీస్‌ భవనాన్ని కూల్చివేసేందుకు మున్సిపల్‌ కమిషనర్‌ ఈనెల 7న కన్ఫర్మేషన్‌ ఆర్డర్‌ జారీ చేశారు. దానిని సవాల్‌ చేస్తూ వైసీపీ రాష్ట్ర నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది వివేకానంద విరూపాక్ష.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆఫీస్‌ బిల్డింగ్‌ల విషయంలో గతంలో ఇదే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మున్సిపల్‌ అధికారుల నోటీసుకు సమగ్ర వివరాలతో వివరణ ఇచ్చామని కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ దానిని పరిగణనలోకి తీసుకోకుండా, ఎలాంటి నోటీసూ ఇవ్వకుండా భవనం కూల్చివేతకు కన్ఫర్మేషన్‌ ఆర్డర్‌ జారీ చేశారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. అధికారులు లేవనెత్తిన ప్రతి అభ్యంతరానికీ సమాధానం ఇచ్చామని, ఒక్క దాన్ని కూడా కనీస స్థాయిలో పరిగణనలోకి తీసుకోలేదని, సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని వివరించారు.

వాదనలు విన్న న్యాయమూర్తి, మున్సిపల్‌ కమిషనర్‌ జారీ చేసిన కన్ఫర్మేషన్‌ ఆర్డర్‌ను రద్దు చేస్తూ తాజా ఉత్తర్వులు ఇచ్చారు. వైసీపీ భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలు, ఆ పార్టీ వర్గాలు సమర్పించే అదనపు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి, విచారణ జరిపిన తరువాతే చట్ట ప్రకారం 8 వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోరాదని ఆదేశించింది.

First Published:  23 Aug 2024 11:10 AM IST
Next Story