ఐటీ అభివృద్ధి క్షీణిస్తోంది, జాగ్రత్త..
కాంగ్రెస్ వచ్చాక ఆ వృద్ధి క్రమంగా క్షీణిస్తోందని, ఇది మనకు ఓ హెచ్చరిక లాంటిదని అన్నారు కేటీఆర్.
తెలంగాణలో ఐటీ అభివృద్ధి క్షీణిస్తోందని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గణాంకాలతో సహా పరిస్థితిని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో గత ఆరేడు సంవత్సరాలుగా ఐటీ ఉద్యోగాలు, ఐటీ ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి సాధించామని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక ఆ వృద్ధి క్రమంగా క్షీణిస్తోందని, ఇది మనకు ఓ హెచ్చరిక లాంటిదని అన్నారు కేటీఆర్.
We’ve had a great run in terms of growth of our IT jobs created and IT exports over the last 6-7 years
— KTR (@KTRBRS) August 6, 2024
Had a chance to look at the latest trends released by the govt. The alarming decline in Telangana's IT exports is a matter of serious concern. Even more concerning is the fact… pic.twitter.com/BVqWjfLxnm
ఐటీ ఎగుమతులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 57,706 కోట్లు ఉండగా, 2023-24 నాటికి అవి రూ. 26,948 కోట్లకు పడిపోయాయని గుర్తు చేశారు కేటీఆర్. ఐటీ ఉద్యోగాల్లో కూడా క్షీణత ఉందన్నారు. ఇది ఆందోళనకరంగా ఉందని చెప్పారు. 2022-23 మధ్య 1,27,594 కొత్త ఉద్యోగాలు ఐటీ రంగంలో వచ్చాయని, 2023-24లో మాత్రం కేవలం 40,285 కొత్త ఉద్యోగాల కల్పన మాత్రమే జరిగిందన్నారు. హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధికి ఐటీ రంగం కీలకం అని గుర్తు చేశారు కేటీఆర్. ఆ విషయంలో నిర్లక్ష్యం తగదని కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలంటించారు.
బీఆర్ఎస్ హయాంలో TS iPASS సహా సింగిల్ విండో వ్యవస్థల కారణంగా ఐటీలో మునుపెన్నడూ చూడని అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు కేటీఆర్. ఐటీ, ఐటీ ఆధారిత రంగాలకు తాము ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. తమ విధానాలను కొనసాగించాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీలకు ప్రాధాన్యతనిస్తూ కొత్త పెట్టుబడులు ఆకర్షించాలన్నారు. యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వాలని చెప్పారు. ఐటీరంగం అభివృద్ధి చెందాలంటే కేవలం మౌలిక వసతుల కల్పన మాత్రమే సరిపోదని, ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతల అంశం కూడా ఆ రంగాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పారు కేటీఆర్. వాటిపై దృష్టిపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవుపలికారు.