ఏపీ ఖజానాకు మద్యం టెండర్ల కిక్కు
అప్లికేషన్ల రూపంలోనే రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం.. నేటితో ముగియనున్న టెండర్ల ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ ఖజానాకు మద్యం టెండర్లు కిక్కు ఇస్తున్నాయి. అప్లికేషన్ ఫీజుల రూపంలోనే రెండు రోజుల్లో రూ. వెయ్యి కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకు టెండర్ల దాఖలకు గడువు ఉండటం, అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు అర్ధరాత్రి వరకు అవకాశం ఇవ్వడంతో మద్యం టెండర్ల ఆదాయం మరింత పెరగనుందని ఆ రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు లెక్కలు వేసకుంటున్నారు. ఏపీలోని 3,396 మద్యం షాపులకు రెండేళ్ల కాలానికి టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. బుధవారం మొదలైన టెండర్లు శుక్రవారం సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. ఆన్ లైన్ లోనూ టెండర్లు దాఖలు చేయడానికి అవకాశం ఇవ్వడంతో అమెరికాతో పాటు వివిధ దేశాల నుంచి ఏపీలో మద్యం షాపులకు టెండర్లు దాఖలు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల వరకు ఎక్సైజ్ స్టేషన్ల దగ్గర క్యూ లైన్లలో ఉన్నవారికి టోకెన్ నంబర్లు జారీ చేస్తామని.. టోకెట్లు ఇచ్చిన వారందరూ టెండర్లు దాఖలు చేయవచ్చని ఏపీ ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. మద్యం షాపుల కోసం వచ్చిన టెండర్లను శని, ఆదివారాల్లో పరిశీలిస్తారు. నిబంధనల మేరకు ఉన్న టెండర్లను ఫైనల్ డ్రాకు ఎంపిక చేస్తారు. సోమవారం ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి షాపులు కేటాయిస్తారు. ఈనెల 16వ తేదీ నుంచి కొత్త షాపులు తెరుచుకోవచ్చు. ఒక్కో మద్యం షాపునకు రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు లైసెన్స్ ఫీజుగా నిర్దారించారు. షాపు ఉన్న ప్రాంతాన్ని బట్టి వాయిదాల పద్ధతిలో లైసెన్స్ ఫీజు చెల్లించే వెసులుబాటు ఉంది. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం గురువారం రాత్రి 8 గంటల వరకూ 65,629 అప్లికేషన్స్ వచ్చాయని, వీటి ద్వారా ప్రభుత్వానికి నాన్ రిఫండబుల్ ఫీజు రూపంలో రూ.1,312.58 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు ప్రకటించారు. శుక్రవారం చివరి రోజు కావటంతో 20 వేలకు పైగా అప్లికేషన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.