10రోజులు, 9 లక్షలు.. జనసేన టార్గెట్ ఫిక్స్
జనసేన ప్రారంభించినప్పుడు వెయ్యిమంది క్రియాశీలక సభ్యులు ఉండేవారు. ఇటీవల ఆ సంఖ్య 6.47 లక్షలకు చేరుకుంది. ఈసారి 9 లక్షలు టార్గెట్ పెట్టుకున్నారు.
ఊహించని రీతిలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన జనసేన.. ఇప్పుడు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టింది. క్రియాశీలక సభ్యత్వాల నమోదుని మొదలు పెడుతోంది. ఈనెల 18నుంచి ఈ సభ్యత్వ నమోదు మొదలవుతుందని పార్టీ నేతలు ప్రకటించారు. 9 లక్షలమంది క్రియాశీలక సభ్యులు ఉండేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
ఈ నెల 18 నుంచి 28 వరకు జనసేన క్రియాశీలక సభ్యత్వ మహా యజ్ఞం
— JanaSena Party (@JanaSenaParty) July 13, 2024
10 రోజులపాటు కొనసాగనున్న నాలుగో విడత సభ్యత్వ నమోదు
ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది వాలంటీర్లతో నమోదు ప్రక్రియ
సమష్టిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనకు పని చేద్దాం
సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నాయకులతో టెలీ… pic.twitter.com/RHO0e7yZhh
నాలుగో విడత జరుగుతున్న క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం 10రోజులపాటు నిర్వహిస్తారు. ఒక్కో నియోజకవర్గంలో 50మంది వాలంటీర్లు ఈ సభ్యత్వ నమోదు చేపడతారు. జనసేన ప్రారంభించినప్పుడు వెయ్యిమంది క్రియాశీలక సభ్యులు ఉండేవారు. ఇటీవల ఆ సంఖ్య 6.47 లక్షలకు చేరుకుంది. ఈ ఎన్నికల ఘన విజయం తర్వాత జనసేన సభ్యత్వాలు మరింత ఎక్కువగా ఉండాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. 9 లక్షల సభ్యత్వాలు ఉండాలని ఆయన టార్గెట్ ఫిక్స్ చేశారు.
గతంలో ప్రతి నియోజకవర్గంలో 15మంది వాలంటీర్లు క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసేవారు. వారికి మాత్రమే లాగిన్ ఐడీలు ఇచ్చేవారు. ఈసారి నియోజకవర్గానికి 50మంది వాలంటీర్లను సిద్ధం చేశారు. లాగిన్ ఐడీలు ఇచ్చి వారితో సభ్యత్వాలు నమోదు చేయిస్తున్నారు. క్రియాశీలక సభ్యుల వద్ద రుసుము వసూలు చేస్తారు, వారికి జీవిత బీమా సౌకర్యం ఉంటుంది, పార్టీ కిట్ అందిస్తారు. జనసేన టార్గెట్ 9 లక్షలు మించి సభ్యత్వాలు నమోదయ్యే అవకాశముంది.