Telugu Global
Andhra Pradesh

అల్లు అర్జున్‌కు జనసేన ఎమ్మెల్యే వార్నింగ్‌

అల్లు అర్జున్‌ తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఊహించుకుంటున్నారని, ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నాడంటూ బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

అల్లు అర్జున్‌కు జనసేన ఎమ్మెల్యే వార్నింగ్‌
X

అల్లు అర్జున్ - మెగా ఫ్యాన్స్‌ మధ్య వివాదం తారాస్థాయికి చేరుతోంది. ఇన్నాళ్లూ రెండు వర్గాల ఫ్యాన్స్‌కు మాత్రమే పరిమితమైన ఈ వివాదం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఫస్ట్ టైం ఈ వివాదంపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పందించారు. అంతే కాదు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బొలిశెట్టి వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.


ఇంతకీ బొలిశెట్టి ఏమన్నారంటే -

అసలు అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తనకు తెలియదన్నారు బొలిశెట్టి. ఉన్నదంతా మెగా ఫ్యాన్స్ మాత్రమేనన్నారు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా షామియానా కంపెనీ తరహాలో పెట్టుకుంటే అది మాకు సంబంధం లేని విషయమన్నారు. అల్లు అర్జున్‌ తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఊహించుకుంటున్నారని, ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నాడంటూ బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు బొలిశెట్టి.

నాకిష్టమైతేనే వస్తా అని అల్లు అర్జున్ అంటున్నాడని, అతన్ని రమ్మంది ఎవరంటూ బొలిశెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ వచ్చినా, రాకపోయినా ఇబ్బందేం లేదన్నారు. 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాలు గెలిచామన్న బొలిశెట్టి.. అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన అభ్యర్థి గెలిచాడా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు గతంలో అల్లు అరవింద్ ఎంపీగా పోటీ చేస్తే అల్లు అర్జున్ గెలిపించాడా అంటూ చురకలంటించారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో మొదలైన ఈ మెగా వివాదం ముదురుతూ వస్తోంది. ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న బన్నీ.. ఇష్టమైన వాళ్ల కోసం మనం నిలబడాలి, నాకు ఇష్టమైతే వస్తా, నా మనసుకు నచ్చితే వస్తా అంటూ కామెంట్ చేశారు. ఇప్పటివరకూ ఈ వివాదంపై జనసేన సభ్యులు ఎవరూ స్పందించలేదు. కానీ, తాజాగా ఎమ్మెల్యే బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి. జనసేనలో సీనియర్ నేతగా ఉన్న బొలిశెట్టి పార్టీ ఆదేశం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్న టాక్ వినిపిస్తోంది. పార్టీ హైకమాండ్ ఆదేశాలతోనే బొలిశెట్టి స్పందించారని వాదన వినిపిస్తోంది. దీంతో బన్నీ - పవన్‌ మధ్య వివాదం తారా స్థాయికి చేరిందన్న ప్రచారం జరుగుతోంది.

First Published:  27 Aug 2024 7:27 PM IST
Next Story