ఆ మూడు డైలాగుల్ని రిపీట్ చేస్తున్న జగన్
చేసిన మంచి ఎక్కడికీ పోదని, వచ్చే ఎన్నికల్లో అదే మనకు శ్రీరామ రక్షలా ఉంటుందన్నారు జగన్
- మీ జగనే ఉండి ఉంటే.. అమ్మఒడి వచ్చేది, రైతు భరోసా వచ్చేది, విద్యాదీవెన ఇచ్చేవాళ్లం.
- మీ జగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతాడని ఆశతో ఓట్లు వేసి మోసపోయారు.
- మీకు 15వేలు, మీకు 15వేలు, మీకు 18వేలు..
ఇటీవల జగన్ ప్రసంగాల్లో దాదాపుగా ఈ మూడు అంశాలు రిపీట్ అవుతున్నాయి. ప్రెస్ మీట్ పెట్టినా, పరామర్శకు వెళ్లినా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో మీటింగ్ జరిగినా.. ఈ మూడు అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు జగన్. తాజాగా ఆయన మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. మీ జగనే ఉండి ఉంటే.. ఈపాటికే రైతు భరోసా అందేదని, స్కూళ్లకు వెళ్తున్న ప్రతి పిల్లాడి తల్లికి అమ్మ ఒడి అందేదని, సున్నావడ్డీ నిధులు కూడా జమ అయ్యేవని, విద్యాదీవెన, వసతి దీవెన వచ్చేవని, మత్స్యకార భరోసా, వాహన మిత్ర కూడా వచ్చి ఉండేవని, చేనేతలకు నేతన్న నేస్తం కూడా ఈపాటికే జమ అయ్యేదని గుర్తు చేశారు. ప్రతి ఏటా ఆగస్ట్ నెలాఖరునాటికి ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం ఇచ్చేదని చెప్పారు. ఇప్పుడు తాను అధికారంలో లేకపోవడం వల్ల ఈ పథకాలన్నీ అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు జగన్.
చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని, చివరకు ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు జగన్. గతంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా వైసీపీ ప్రభుత్వం సాకులు చూపలేదన్నారాయన. మాట తప్పుకుండా మేనిఫెస్టోనే అమలు చేశామని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకోసం కట్టుబడి పనిచేశామని, ప్రతి ఇంటికీ మంచి చేశామన్నారు. చేసిన మంచి ఎక్కడికీ పోదని, వచ్చే ఎన్నికల్లో అదే మనకు శ్రీరామ రక్షలా ఉంటుందన్నారు జగన్.
చంద్రబాబు మోసాలను చూస్తున్న ప్రజల్లో ఆగ్రహం మొదలవుతోందని, ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో వైసీపీదే ఘన విజయం అని చెప్పారు జగన్. ఐదేళ్లు వైసీపీ నేతల్ని కష్టాలు పెడతారని, కానీ కష్టాలు ఎల్లకాలం ఉండవని, చీకటి తర్వాత వెలుగు ఉంటుందని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు భరోసా ఇచ్చారు జగన్.