Telugu Global
Andhra Pradesh

రుషికొండను ఏం చేద్దాం.. చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

కొంతమంది టూరిజం డిపార్ట్‌మెంట్‌కు ఇవ్వాలని సూచనలు చేస్తున్నారని.. అయితే ఆ నిర్ణయం ఏ మేరకు మేలు చేస్తుందో తనకు తెలియదన్నారు. రుషికొండ ప్యాలెస్‌ ఏం చేద్దామంటూ సభ్యుల నుంచి సూచనలు, సలహాలు కోరారు.

రుషికొండను ఏం చేద్దాం.. చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌
X

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రుషికొండ ప్యాలెస్‌పై విశేషంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రుషికొండ ప్యాలెస్‌ను పరిశీలించి..లోపలి దృశ్యాలను, విజువల్స్‌ మీడియాకు రిలీజ్ చేశారు. దీంతో రుషికొండ ప్యాలెస్‌ను కొత్త ప్రభుత్వం ఎలా ఉపయోగించబోతుందన్న చర్చ మొదలైంది. తాజాగా అసెంబ్లీలోనూ రుషికొండ ప్యాలెస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఇంతకీ చంద్రబాబు ఏమన్నారంటే..

రుషికొండ ప్యాలెస్‌ జగన్ అహంభావానికి నిదర్శనమన్నారు చంద్రబాబు. దాదాపు రూ.500 కోట్లు ఖర్చు పెట్టి రుషికొండను కొట్టేసి ప్యాలెస్‌ నిర్మించారని చెప్పుకొచ్చారు. రుషికొండకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. ప్యాలెస్‌ ఎందుకు కట్టారంటే...ప్రధానమంత్రి, రాష్ట్రపతి కోసం కట్టామంటూ వైసీపీ నేతలు చెప్తున్నారని.. వాటిని మనం నమ్మాలా అంటూ సభ్యులను ప్రశ్నించారు చంద్రబాబు. మనం ఒకటి తలిస్తే.. భగవంతుడు మరొకటి తలుస్తాడనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ప్యాలెస్‌ నిర్మాణం కోసం టూరిజం శాఖ నుంచి రూ.500 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. రుషికొండ ప్యాలెస్‌పై ఇంకా తాను పూర్తిగా తెలుసుకోలేదన్నారు. ప్రస్తుతానికి ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తూ వెళ్తున్నామన్నారు.

త్వరలోనే ఎమ్మెల్యేలందరినీ తీసుకుని రుషికొండ ప్యాలెస్ విజిట్ చేస్తానన్నారు చంద్రబాబు. అసెంబ్లీ సమావేశాల తర్వాత రుషికొండకు వెళ్దామన్నారు. రుషికొండ ప్యాలెస్‌ను ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. కొంతమంది టూరిజం డిపార్ట్‌మెంట్‌కు ఇవ్వాలని సూచనలు చేస్తున్నారని.. అయితే ఆ నిర్ణయం ఏ మేరకు మేలు చేస్తుందో తనకు తెలియదన్నారు. రుషికొండ ప్యాలెస్‌ ఏం చేద్దామంటూ సభ్యుల నుంచి సూచనలు, సలహాలు కోరారు. మధ్యలో కలగజేసుకున్న ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్‌ సెవన్ స్టార్ హోటల్ చేయాలని సూచించగా.. నిర్వహణ మీకే ఇస్తామంటూ చంద్రబాబు సమాధానమిచ్చారు. ప్యాలెస్‌ చూస్తే సెవన్‌ స్టార్‌, నైన్ స్టార్‌ హోటల్స్ కూడా పని చేయవన్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లా చేయాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు సూచించారు. అయితే త్వరలోనే సభ్యులందరీ సూచనలు తీసుకున్న తర్వాతే రుషికొండ ప్యాలెస్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు చంద్రబాబు.

First Published:  23 July 2024 1:26 PM GMT
Next Story