Telugu Global
Andhra Pradesh

వాయుగుండం ప్రభావం.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు

ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్టీఎంఏ సూచన

వాయుగుండం ప్రభావం.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు
X

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయవ్య దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్టీఎంఏ) తెలిపింది. ప్రస్తుతం చెన్నైకి 440 కి.మీ, పుదుచ్చేరికి 460 కి.మీ, నెల్లూరుకు 530 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది. ఇది గురువారం తెల్లవారుజామున చెన్నై, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. వాయుగుండం ప్రభావంతో నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతోప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్టీఎంఏ సూచన

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, కావలి, అల్లూరు, బిట్రగుంటలో వానలు పడుతున్నాయి. జలదంకిలో 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కావలిలో 33.9 సెంటీమీటర్లు, ఇందుకూరు పేటలో 23 సెం.మీ, గుడ్లూరులో 20.5 సెం.మీ., లింగసముద్రంలో 19.8 సెం.మీ., వింజమూరు 19.5 సెం.మీ., వరికుంటపాడులో 14.6 సెం.మీ, వర్షపాతం నమోదైంది. వరికుంటపాడు మండలం కనియంపాడులో పిల్లపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కొండాపురం మండలం సత్యవోలు అగ్రహారం వద్ద మిడతవాగులో వరద ఉధృతి ఎక్కువగా ఉన్నది.

ప్రకాశంలో దంచికొడుతున్న వాన

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, పాదర్తి, రాజుపాలెం , మూటుమాలలో, గుండమాల, కె.పల్లెపాలం, కొత్తపట్నం, సింగరాయకొండ, టంగుటూరు మండలాల్లో మోస్తరు వాన పడుతున్నది. తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు మురుగు కాల్వలో చెత్తను తొలిగిస్తున్నారు. సహాయ చర్యలకు 360 మంది పోలీసులతో 18 బృందాలు పనిచేస్తున్నాయి. తీర ప్రాంతాల్లో ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

ఉమ్మడి అనంతరం, కడప జిల్లాల్లో భారీ వర్షం

ఉమ్మడి అనంతరం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరపీలేకుండా వాన పడుతున్నది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై పలుచోట్ల రెండు అడుగుల వరకు నీరు నిలిచింది. జిల్లాలో నేడు, రేపు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోనూ పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. అధికారులు వాగులు, నదీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు. పాఠశాలలకు మూడు రోజులు సెలవు ప్రకటించిన కలెక్టర్‌ . ఉమ్మడి కడప జిల్లాలో రాత్రి నుంచి వాన పడుతున్నది. జిల్లాలో ప్రభుత్వ , ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

First Published:  16 Oct 2024 5:22 AM GMT
Next Story