Telugu Global
Andhra Pradesh

గత ప్రభుత్వపు విషబీజాల అవశేషాలివి.. హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, వారి మాయలో పడొద్దని, వారు రెచ్చగొట్టినా సంయమనం పాటించాల్సిన బాధ్యత టీడీపీ, జనసేన కార్యకర్తలపై ఉందని అన్నారు హోం మంత్రి అనిత.

గత ప్రభుత్వపు విషబీజాల అవశేషాలివి.. హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

ఏపీలో జరుగుతున్న వరుస దాడులు, అఘాయిత్యాలు, దుర్ఘటనలపై హోం మంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ గత ప్రభుత్వపు విష బీజాల అవశేషాలని ఆరోపించారు. వాటిని తొలగించాల్సిన బాధ్యత తమపై పడిందన్నారామె. గత ఐదేళ్లలో ఏపీలో పోలీస్ వ్యవస్థ అంతా నిర్వీర్యమైపోయిందని, ఆ ఫలితాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నామని చెప్పారు. ఏపీలో సీసీ కెమెరాల వ్యవస్థ పనిచేయట్లేదని, కనీసం ఫింగర్ ప్రింట్ వ్యవస్థ కూడా సరిగా లేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితులన్నిటినీ తాము చక్కదిద్దుతున్నామని అన్నారు మంత్రి అనిత..


గత పాలనలో అందరికంటే ఎక్కువగా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ ఇబ్బంది పడ్డారని, చివరకు తాను కూడా బాధితురాలినేనని అన్నారు అనిత. జగన్‌ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారని ఆరోపించారు. ఆ అరాచక పాలనకు ముగింపు పలికిన జనం.. ఇప్పుడు మనకు అధికారం ఇచ్చారని అన్నారు. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, వారి మాయలో పడొద్దని, వారు రెచ్చగొట్టినా సంయమనం పాటించాల్సిన బాధ్యత టీడీపీ, జనసేన కార్యకర్తలపై ఉందని అన్నారు హోం మంత్రి అనిత. వైసీపీ వాళ్లు రెచ్చగొడుతున్నా చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే పని చేయొద్దని కూటమి శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై మాజీ సీఎం జగన్ ట్వీట్ పై హోం మంత్రి అనిత ఘాటుగా స్పందించారు. గత ఐదేళ్లలో జరిగిన అరాచకాలను కూడా ఆ ట్వీట్ లో ప్రస్తావించాల్సిందని ఎద్దేవా చేశారు. వైఎస్ వివేకా హత్య, ఎమ్మెల్సీ అనంత్‌ బాబు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని డోర్‌ డెలివరీ చేయడం వంటి ఘటనలను కూడా జగన్, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిందని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడేది లేదన్నారు హోం మంత్రి అనిత.

First Published:  19 July 2024 1:45 AM GMT
Next Story