Telugu Global
Andhra Pradesh

జగన్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ వెహికిల్‌, జామర్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు

మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంటుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

జగన్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ వెహికిల్‌, జామర్‌.. హైకోర్టు కీలక ఆదేశాలు
X

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ సెక్యూరిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్‌కు భద్రత కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. తన భద్రతకు ముప్పు ఉందని, సెక్యూరిటీ తగ్గించేశారని, రిపేర్‌కు వచ్చిన వెహికిల్‌ను కేటాయించారని హైకోర్టులో జగన్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. జగన్‌ సెక్యూరిటీపై విచారణ జరిపిన హైకోర్టు.. మరో బుల్లెట్ ప్రూఫ్‌ వెహికిల్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కోర్టు ఆదేశాలతో జగన్‌కు మరొక బుల్లెట్ ప్రూఫ్‌ వెహికిల్‌ కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇక దాడులు జరుగుతాయని అనుమానం ఉన్న చోట జగన్‌ పర్యటించే సమయంలో జామర్‌ కూడా కేటాయిస్తామని కోర్టుకు తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంటుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. మాజీ సీఎంలకు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనలు లేనప్పటికీ.. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.

తనకు ఉన్న సెక్యూరిటీని యథావిథిగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన భద్రత సిబ్బందిని తగ్గించారని, ఇల్లు, ఆఫీసు దగ్గర సెక్యూరిటీని పూర్తిగా తొలగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు జగన్. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికిల్‌ కూడా ప్రయాణానికి అనుకూలంగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో ఏసీ పని చేయడం లేదని పిటిషన్‌లో స్పష్టం చేశారు. దీంతో ఓ పర్యటనను మధ్యలోనే రద్దు చేసుకోవాల్సి వచ్చిందన్నారు జగన్.

First Published:  7 Aug 2024 5:47 PM IST
Next Story