Telugu Global
Andhra Pradesh

ఏపీలోని పలు ప్రాంతాలకు అతి భారీ వర్ష సూచన

అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు,ప్రకాశం జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షం

ఏపీలోని పలు ప్రాంతాలకు అతి భారీ వర్ష సూచన
X

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నది. ఇది బలపడి వాయుగుండగా మారే అవకాశం ఉన్నదని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ, వాయివ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరంవైపు కదులుతుందని తెలిపింది.ఈ ప్రభావంతో నేడు, రేపు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు. తీరం వెంబడి తీవ్రమైన బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించారు. భారీ వర్షాలు పడుతాయని హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది .

బంగాళాఖాతంలో అల్పపీడనం వేగంగా కదులుతున్నది. ఇది వచ్చే 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో నేడు పశ్చిమగోదావరి, ఏలూరు , కృష్ణ, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. తీరం వెంబడి గంటలకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. మత్స్య కారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.

అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే నెల్లూరు జిల్లాలో రెండోరోజు భారీ వర్షాలు పడుతున్నాయి. 25 మండలాల్లో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి ఉరుములు, పిడుగులతో వర్షం కురిసింది. నిన్న రాత్రి వరకు 16 మండలాల్లో అత్యధిక వాన పడింది. వెంకటగిరి, నెల్లూరులో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను అధికారులు సిద్ధం చేశారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు, గాలులు వీసే అవకాశం ఉన్నదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు జిల్లాలో 140కి పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించారు. నెల్లూరులో రెండో రోజు విద్యా సంస్థలకు కలెక్టర్‌ సెలవు ప్రకటించారు.

ప్రకాశం జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. కొనకలమెట్ల, పొదిలి, పొన్నలూరు, పామూరులో అధిక వర్షపాతం నమోదైంది. ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ మండలాల్లో తీరప్రాంత గ్రామాల్లో 8 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేడు జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

First Published:  15 Oct 2024 5:05 AM GMT
Next Story