పెళ్లి వేడుకలో ప్రియురాలు బీభత్సం.. నిలిచిపోయిన వివాహం
పెళ్లి కొడుకుపై కత్తి, యాసిడ్‌తో దాడికి యత్నించింది. అయితే అక్కడున్న బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. యాసిడ్ వరుడి పక్కనే ఉన్న కరిష్మా అనే యువతి ముఖంపై పడి గాయాలయ్యాయి
ఆనందోత్సాహాల నడుమ జరుగుతున్న పెళ్లి వేడుకలోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన యువతి బీభత్సం సృష్టించింది. పెళ్లి కొడుకు తనతో పదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుంటూ తనను మోసం చేస్తున్నాడని ఆమె తెలిపింది. అంతేకాదు.. తనను కాదని వేరొక పెళ్లి చేసుకుంటున్నాడనే ఆగ్రహంతో తన వెంట తెచ్చుకున్న యాసిడ్, కత్తితో శివంగిలా శివాలెత్తింది. దీంతో పెళ్లి మండపం రణరంగంలా మారింది. ఈ క్రమంలో అరుపులు, కేకలతో మండపమంతా దద్దరిల్లింది. ఊహించని పరిణామంతో పెళ్లికి వచ్చిన బంధువులు నిర్ఘాంతపోయారు. అన్నమయ్య జిల్లా నందలూరులో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ బాషా.. తనతో పదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని సదరు యువతి చెబుతోంది. తనది తిరుపతి అని, బాషా కొద్దిరోజులుగా కనిపించకుండా తిరుగుతుండటంతో అనుమానం వచ్చి అతన్ని వెతుక్కుంటూ రైల్వేకోడూరుకు వచ్చి ఆరా తీసింది. ఆదివారం నందలూరులో బాషాకు వివాహం జరగనుందని తెలుసుకొని నేరుగా వివాహం జరిగే షాదీఖానా వద్దకు వచ్చింది. తనను మోసం చేసిన విషయంపై వరుడిని నిలదీసేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. పెళ్లి కొడుకుపై కత్తి, యాసిడ్‌తో దాడికి యత్నించింది. అయితే అక్కడున్న బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. యాసిడ్ వరుడి పక్కనే ఉన్న కరిష్మా అనే యువతి ముఖంపై పడి గాయాలయ్యాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాషా.. కత్తితో తన ప్రియురాలి వీపు, భుజంపై బలంగా పొడిచాడు. ఈ ఘటనలో ఆమె తీవ్ర గాయాలపాలైంది. గాయపడిన ఇద్దరు యువతులను స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వారు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో వివాహం అర్ధంతరంగా నిలిచిపోయింది. వధువు తరపు బంధువులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.