Telugu Global
Andhra Pradesh

ఏపీ సెక్రటేరియట్ లో కోవర్ట్ ఆపరేషన్..? జీపీఎస్ జీఓపై రగడ

జీపీఎస్ జీఓ విషయంలో మరో ఇద్దరు అధికారులపై వేటుపడే అవకాశముంది. ఆ ఇద్దరి పేర్లతో సహా టీడీపీ అనుకూల మీడియా లీకులివ్వడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.

ఏపీ సెక్రటేరియట్ లో కోవర్ట్ ఆపరేషన్..? జీపీఎస్ జీఓపై రగడ
X

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక పలు దఫాల్లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు బదిలీ అయ్యారు. అంతకు మందే సీఎస్, డీజీపీ, వివిధ శాఖల ఉన్నతాధికారుల్ని కూడా బదిలీ చేశారు. అయినా ఇంకా ఎక్కడో తేడాకొడుతోందనే అనుమానం టీడీపీ వర్గాల్లో ఉంది. ఇటీవల గ్యారెంటీ పెన్షన్ స్కీమ్(జీపీఎస్) జీఓ, గెజిట్ విడుదల విషయంలో ఇదే జరిగిందని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ జీఓ విడుదలకు కారణమైన అధికారి ఆల్రడీ సెలవుపై వెళ్లిపోగా ఇప్పుడు మరో ఇద్దరు అధికారులపై వేటుపడే అవకాశముంది. ఆ ఇద్దరి పేర్లతో సహా టీడీపీ అనుకూల మీడియా లీకులివ్వడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.

ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్ తీసుకు రావాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులు వద్దంటున్నా.. ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది, ఎన్నికల వేళ దాని అమలు కాస్త ఆలస్యమైంది. కొత్త ప్రభుత్వం జీపీఎస్ కి వ్యతిరేకం అని తెలిసినా కూడా సరిగ్గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు జీపీఎస్ జీఓ విడుదలైంది. ఆ తర్వాత నెలరోజులకు ఆ జీఓ గెజిట్ రూపములో అప్ లోడ్ కావడంతో అసలు రగడ మొదలైంది. ఏరికోరి నెత్తిన తెచ్చిపెట్టుకున్న కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మొండిచేయి చూపించిందని సీపీఎస్ రద్దు చేయకపోగా జీపీఎస్ అమలు చేస్తోందని వైసీపీ నేతలు ఎద్దేవా చేశారు. దీంతో కొన్నిచోట్ల ఉపాధ్యాయ సంఘాలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించాయి. అంతలోనే ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది, జీపీఎస్ జీఓని రద్దు చేసింది. ప్రతిపక్షంలో తమ తొలివిజయంగా దీన్ని వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది.

జీపీఎస్ జీఓ విడుదల, గెజిట్ విడుదల రహస్యంగా జరిగాయని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు. గత ప్రభుత్వం చివరి ఆరు నెలల్లో అమలు చేయని నిర్ణయాల ఫైళ్లను కొత్త ప్రభుత్వం ముందు ఉంచాలని నిబంధనలున్నాయి. అమలులో లేని పాత ప్రభుత్వ నిర్ణయాల అమలుకు కొత్త ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అనేది బిజినెస్ రూల్స్‌లో కూడా ఉంటుందని అంటున్నారు. జీపీఎస్ జీఓ విషయంలో ఈ ప్రాసెస్ జరగలేదని చెబుతున్నారు. దీనికి కారణమైన ఇద్దరు అధికారులపై వేటుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

First Published:  17 July 2024 12:50 PM GMT
Next Story