Telugu Global
Andhra Pradesh

ఉచితం అంటే ఏంటి..? ఇసుక రేటు తగ్గిందా..? పెరిగిందా..?

ఇరు పార్టీల వాదన ఎలా ఉన్నా.. ఏపీలో ఇసుక పూర్తి ఉచితం కాదు, అలాగని గత ప్రభుత్వంలో ఉన్న రేట్లు ఇప్పుడు లేవు.

ఉచితం అంటే ఏంటి..? ఇసుక రేటు తగ్గిందా..? పెరిగిందా..?
X

ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలులోకి వచ్చింది. ఉచితం అంటే ఫ్రీ అని అర్థం కాదు, దానికి కూడా ఓ రేటు ఉంటుంది, అయితే అది నామ మాత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో కంటే చవక అని అర్థం. అయితే ఉచిత ఇసుక అంటూ ఇంకా డబ్బులు వసూలు చేయడం ఎందుకని వైసీపీ విమర్శలు చేస్తోంది. ఉచితం పేరుతో ప్రజలల్ని మోసం చేస్తున్నారని మండిపడుతోంది. సోషల్ మీడియాలో కూడా ఉచిత ఇసుక విధానంపై సెటైర్లు పేలుస్తున్నారు వైసీపీ నేతలు.


మరో అడుగు ముందుకేసి.. గతంలో కంటే ఇప్పుడే ఇసుక రేట్లు పెరిగాయని అంటున్నారు వైసీపీ నేతలు. తమ హయాంలోనే ఇసుక రేట్లు తక్కువగా ఉండేవని, ఇప్పుడు ఉచితం పేరుతో రేట్లు మరింత పెంచి అమ్ముతున్నారని, రవాణా చార్జీల పేరుతో దోచుకుంటున్నారని మండిపడుతున్నారు. వైసీపీ చేస్తున్న ప్రచారం సగమే నిజం. ఉచితం అనే పేరుతో ప్రభుత్వం పూర్తి ఉచితంగా ఇసుక ఇవ్వడం లేదు. అలాగని ఇసుకకు రేటు కూడా కట్టడంలేదు. కేవలం రవాణా చార్జీలు మాత్రం వసూలు చేస్తోంది. ఆ లెక్కన ఇసుక రేటు భారీగా తగ్గినట్టే లెక్క.


టీడీపీ వాదన మరోలా ఉంది. ఉచిత విధానంతో సామాన్యులకు ఇసుక అందుబాటులోకి వచ్చిందని అంటున్నారు టీడీపీ నేతలు. గతం కంటే సగానికి పైగా ధరలు పడిపోయాయంటున్నారు. కేవలం రవాణా, లోడింగ్ చార్జీలు చెల్లిస్తే చాలని చెబుతున్నారు. గతంలో తిరుపతిలో టన్ను ఇసుక రూ.2,500 ఉంటే, ఇప్పుడు టన్ను కేవలం రూ.590కి లభిస్తోందని అంటున్నారు. సామాన్య ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు.. హర్షం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ నేతలు గొప్పగా చెబుతున్నారు.


ఇరు పార్టీల వాదన ఎలా ఉన్నా.. ఏపీలో ఇసుక పూర్తి ఉచితం కాదు, అలాగని గత ప్రభుత్వంలో ఉన్న రేట్లు ఇప్పుడు లేవు. ఇసుక రేటు భారీగా తగ్గింది. నిర్మాణ రంగంలో ఉన్న వారికి ఇది గొప్ప ఊరట అని చెప్పాలి.

First Published:  9 July 2024 10:55 AM IST
Next Story